ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త సొసైటీల ఏర్పాటుకు సన్నాహాలు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త సొసైటీల ఏర్పాటుకు సన్నాహాలు..
  • మండలానికి రెండు చొప్పున ప్రభుత్వానికి ప్రతిపాదనలు
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 64 పీఏసీఎస్‌లకు ప్రతిపాదన
  • ఈ నెల చివరి నాటికి లేదా వచ్చే నెల మొదటి వారంలో ఏర్పాటు అయ్యే అవకాశాలు 
  • మరోవైపు  జూన్ నెలలో సహకార సంఘాల ముహూర్తం ఫిక్స్ అయ్యే అవకాశాలు

నల్గొండ/యాదాద్రి, వెలుగు:  ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొత్త మండలాల్లో 64 సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సహకార శాఖ అధికారులు పంపించారు. ఈ నెల చివరి నాటికి లేదా వచ్చే నెల మొదటి వారంలో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ప్రత్యేక పాలనలో కొనసాగుతున్న సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించేలా సహకార శాఖ అధికారులు అన్ని  ఏర్పాట్లు
 పూర్తి చేశారు. 

ఇన్‌చార్జిల పాలనతో.. 

జిల్లాలో సహకార ఎన్నికలు 2020 ఫిబ్రవరిలో జరిగాయి. కొలువుదీరిన పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్లు గడిచిపోయాయి. దీంతో ప్రభుత్వం ఎన్నికలకు పోకుండా ఆరు నెలలపాటు వారి పదవీకాలం పొడిగించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల పదవీకాలం ముగియగా, 2025 ఆగస్టు వరకు ఒకసారి, అనంతరం మరో ఆరునెలలు పొడిగించింది. డిసెంబర్ 19న పాలకవర్గాలను తొలగించి ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. రెండు నెలలుగా మాతృసంస్థలలో విధులు నిర్వర్తిస్తూ ఇటు ఇన్చార్జి సేవలను అందిస్తున్నారు.

 ఒక్కో అధికారికి నాలుగు సహకార సంఘాల బాధ్యతలను అప్పగించారు. దీంతో ఇన్చార్జి అధికారుల పాలనతో రైతులకు సరైన సేవలు అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారని అనుకుంటున్నారు. ప్రస్తుతం పది, ఇంటర్ పరీక్షల సమయం కాగా..  అన్ని పరీక్షలు పూర్తి కాగానే జూన్ నెలలో పీఎసీఎస్‌లకు ఎన్నికలనునిర్వహిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాలకవర్గాలు ఉన్నప్పుడే యూరియా, విత్తనాలు, రుణాలు వంటి సేవలకు ఆటంకం లేకుండా అందుతాయని వారు పేర్కొంటున్నారు.  

64  పీఏసీఎస్‌లకు ప్రతిపాదన.. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 64 కొత్త పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయాలని కో ఆపరేటివ్ ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపించారు. నల్గొండ జిల్లాలో 40, సూర్యాపేట జిల్లాలో 15, యాదాద్రి జిల్లాలో 9 కొత్తగా ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 107 సొసైటీలు ఉండగా నల్గొండ జిల్లాలో 42, సూర్యాపేట జిల్లాలో 44, యాదాద్రి  జిల్లాలో 21 ఉన్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న పీఏసీఎస్‌ల పరిధిలోని కొన్ని గ్రామాలను కొత్తవాటిలో  చేర్చాలని గ్రామాల పేర్లను సూచించారు.  

వీటితో పాటు కొత్తగా ఏర్పాటు చేసే సంఘాల్లో చేరాల్సిన రైతుల సంఖ్యతో పాటు వారు తీసుకున్న రుణాల లెక్కలు సూచిస్తున్నారు.  దీంతో ఆయా రైతుల అకౌంట్లలోని పొదుపు, ఇతర వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. కొత్తగా పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయడం వల్ల కొత్తగా పాలకవర్గాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నాటికి లేదా వచ్చే నెల మొదటి వారంలో కొత్త పీఏసీఎస్‌లను ప్రభుత్వం ఆమోదించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.