ఎవరి లెక్క వారిదే!..డబుల్ డిజిట్ మాకంటే మాకే అని మూడు పార్టీల ధీమా

ఎవరి లెక్క వారిదే!..డబుల్ డిజిట్ మాకంటే మాకే అని మూడు పార్టీల ధీమా
  • 13 సీట్లు పక్కా అంటున్న కాంగ్రెస్
  • 12 సీట్లలో గెలుస్తామని చెబుతున్న బీజేపీ 
  • 12–14 సీట్లు సాధిస్తామంటున్న బీఆర్ఎస్
  • జూన్ 4న రిజల్ట్.. అప్పటిదాకా ఉత్కంఠ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగియడంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై చర్చ మొదలైంది. పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటున్న మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. డబుల్ డిజిట్ సీట్లు మాకంటే మాకే వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ మూడు పార్టీల ముఖ్య నేతలు పోలింగ్ శాతానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్టు

తెప్పించుకుని ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో లాగే ఈసారి కూడా రూరల్ ఏరియాల్లోనే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఓటర్లు మాకే అండగా నిలిచారంటూ మూడు పార్టీల నేతలూ చెబుతున్నారు. 

13 సీట్లపై రేవంత్​ ధీమా.. 

ఈసారి 13 సీట్లు దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. 13 సీట్లు పక్కా వస్తాయని పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. పోలింగ్ కు ముందు 14 సీట్లు టార్గెట్ అని చెప్పిన ఆయన.. మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేస్తూ ‘పోలింగ్ సరళిని విశ్లేషించుకున్నం. పక్కాగా13 సీట్లు వస్తాయి” అని చెప్పారు. 

17 లోక్ సభ సెగ్మెంట్ల అభ్యర్థులు, ఇన్ చార్జులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో రేవంత్ మంగళవారం​ఫోన్​లో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దాని ఆధారంగానే 13 సీట్లు వస్తాయని అంచనాకు వచ్చారు. ‘‘ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేయడంతో కాంగ్రెస్​పై ఓటర్లలో సానుకూలత కనిపించింది. మహిళలకు ఫ్రీ బస్, రూ.500 కే సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలుతో మా ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడింది. బీఆర్ఎస్​కు ఈ ఎన్నికలు అవసరం లేదని, ప్రధాని మోదీతో తెలంగాణాకు ఎలాంటి మేలు జరగలేదని  ప్రజలకు అర్థమైంది

బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని, రాజ్యాంగాన్ని మారుస్తారని నేను బయటపెట్టిన ఆధారాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో మంచి సానుకూల ప్రభావం చూపాయి. రుణమాఫీపై నేనిచ్చిన హామీతో రైతుల్లో సానుకూలత వ్యక్తమైంది. అందుకే జనమంతా కాంగ్రెస్ కు ఓటేశారు.. పక్కాగా 13 సీట్లు గెలుస్తాం” అని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.  

8 సీట్లు బోనస్ అంటున్న బీజేపీ.. 

గత లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి 4 సీట్లు రాగా, ఇప్పుడు మరో 8 స్థానాలు బోనస్ గా వస్తాయని మొత్తం 12 సీట్లు గెలుచుకుంటామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పక్కాగా డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని బీజేపీ అగ్ర నేత అమిత్ షా కూడా నమ్మకంతో ఉన్నారు. 12 సీట్లలో విజయం సాధిస్తామని పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని అంటున్నారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రజలు గ్రహించారు. బీఆర్ఎస్​కు ఈ ఎన్నికల్లో ఓటేసినా లాభం లేదని, మోదీ నాయకత్వంలోనే  తెలంగాణ అభివృద్ది చెందుతుందని జనమంతా తెలుసుకున్నారు. అర్బన్ ఓటర్లే కాదు.. రూరల్ ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో మా వెంటే ఉన్నారు” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

మేమే ఫస్ట్ ప్లేస్ అంటున్న బీఆర్ఎస్..  

ఈసారి 12 నుంచి14 సీట్లు గెలుచుకుంటామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండోస్థానం కోసమే పోటీ పడ్డాయని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో తాగునీటి సమస్యలు, కరెంట్ కోతలు మొదలయ్యాయని విమర్శించారు.

ఇక ఈ పదేండ్లలో తెలంగాణకు బీజేపీ ఏమీ ఇవ్వలేదనే విషయాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలపై ఉన్న వ్యతిరేకత, తమకు అనుకూలంగా మారిందని కేసీఆర్ చెబుతున్నారు. 

21 రోజులు ఉత్కంఠ.. 

ఈ మూడు పార్టీల్లో డబుల్ డిజిట్ సీట్లు ఎవరికి దక్కుతాయో తెలియాలంటే వచ్చే నెల 4 వరకు ఆగాల్సిందే. అంటే ఇంకో 21 రోజుల ఉత్కంఠ కొనసాగనుంది. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది తేలనుంది. కాగా, మూడు పార్టీల గెలుపోటములపై రాజకీయ విశ్లేషకులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అర్బన్

రూరల్ ఏరియాలో పోలింగ్ సరళి,  ఓట్ల మార్పిడి, క్యాస్ట్ ల వారీగా  లెక్కలు.. ఇలా వీటన్నింటిపై ఆరా తీస్తున్నారు. ఎవరి ఊహలు, అంచనాలు, అభిప్రాయాలు, లెక్కలు ఎలా ఉన్నా... ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది మాత్రం వచ్చే నెల 4న తేలనుంది.

బీఆర్ఎస్ ఓటు టర్న్.. 

ఈసారి బీఆర్ఎస్ ఓట్లు ఇతర పార్టీలకు టర్న్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదని భావించిన ఆ పార్టీ క్యాడర్, అభిమానుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఇతర పార్టీలకు టర్న్ అయ్యాయని అంటు న్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి, మరికొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు పెద్ద మొత్తంలో బీఆర్​ ఎస్ ఓట్లు పడ్డాయని పేర్కొంటు న్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓట్లు తమకు ఏ మేరకు పడ్డాయనే దానిపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ లెక్కలు వేసుకుంటున్నాయి.

బీఆర్ఎస్ లో ఉన్న బీజేపీ అనుకూల క్యాడర్ పువ్వు గుర్తుకు, కాంగ్రెస్ అనుకూల క్యాడర్ చెయ్యి గుర్తుకు ఓటు వేశారని తెలుస్తున్నది. కొన్నిచోట్ల స్థానిక అభ్యర్థు లను చూసి కాంగ్రెస్, బీజేపీ వైపు మొగ్గు చూపారని చర్చ జరుగుతున్నది. మొత్తానికి కారు ఓటు దారి మళ్లి ఈ రెండు పార్టీలకు చేరడంతో, ఇందులో ఏ పార్టీకి ఎక్కడ గెలుపు దక్కనుంది? అనే చర్చ నడుస్తున్నది.