మూడ్రోజుల ముందే అండమాన్​కు నైరుతి

మూడ్రోజుల ముందే అండమాన్​కు నైరుతి
  • 19న బంగాళాఖాతం వైపు వచ్చే చాన్స్  
  • జూన్ 1న కేరళకు రుతుపవనాలు 
  • తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వారం పాటు వానలు 

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికే వచ్చే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా వానాకాలం సీజన్ కు ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏటా జూన్ 1వ తేదీన కేరళను తాకుతాయి. 

ఆ తర్వాత క్రమంగా జులై 15 నాటికి దేశమంతటా విస్తరిస్తాయి. అయితే, నైరుతి రుతుపవనాలు పోయిన ఏడాది రెండు వారాలు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించాయి. దీంతో సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది. కానీ ఈ సారి నైరుతి సాధారణ సమయానికే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ సోమవారం తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడానికి ముందుగా.. ఏటా మే 22వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని తాకుతాయి. ఆ తర్వాత జూన్ 1కల్లా కేరళ గుండా దేశంలోకి ప్రవేశిస్తాయి.

ఈ ఏడాది మూడు రోజులు ముందుగానే.. అంటే ఈ నెల 19వ తేదీకల్లా నైరుతి అండమాన్ కు, ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుంటున్నాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో కేరళలోకి కూడా నైరుతి సాధారణ సమయానికే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తెలంగాణలోకి జూన్ 8 నుంచి 11 మధ్య నైరుతి ప్రవేశించే చాన్స్ ఉన్నట్టు పేర్కొంది. అయితే, నైరుతి రుతుపవనాలకు సంబంధించి పూర్తి స్థాయి అంచనాలను ఈ నెల చివరి వారంలోనే ప్రకటిస్తామని ఐఎండీ స్పష్టం చేసింది.

కాగా, ఈ ఏడాది సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ పోయిన నెలలోనే వెల్లడించింది. మరోవైపు ఈ నెల 16 తర్వాత వాయవ్య భారత్ లోని ప్రాంతాల్లో హీట్ వేవ్స్ కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఏపీ, తెలంగాణ, బెంగాల్, బిహార్ సహా దక్షిణాది, తూర్పు రాష్ట్రాల్లో మాత్రం వారం రోజుల పాటు వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.

రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే చాన్స్ ఉందంది.  గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్​తోపాటు నిజామాబాద్‌, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చంది.

శుక్రవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో, శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడొచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.