జాతిపిత మహాత్మాగాంధీజీని భౌతికంగా హతమార్చినవారు, వారి మద్దతుదారులు, సిద్దాంత వారసులు.. నేడు గాంధీజీ ఉనికిపై హత్యాయత్నానికి తలపడ్డారు. ఒక ప్రజాహిత కార్యక్రమం నుంచి బాపూజీ పేరును తొలగించడం భారత ప్రజాస్వామ్యం సాక్షిగా వారి తెంపరితనానికి నిదర్శనం. గ్రామ స్వరాజ్యం గురించి గాంధీజీ కన్న కలలు సాకారం కానీయకుండా మన రాజ్యాంగాన్ని వంచిస్తూ అడ్డుపడుతున్న సైంధవులు వీరు.
ఈ దేశ పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతూ, వారి ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక ప్రగతికి బాటలు వేస్తున్న ఒక గొప్ప పథకం నుంచి మహాత్ముడి పేరును తొలగించడమే కాకుండా, దాని ‘ఆత్మ’ను చంపిన దౌర్జన్యం కేంద్రంలోని బీజేపీ నేతృత్వపు ప్రభుత్వానిది. ఇంతకాలం ముసుగులో దుర్మార్గాలు చేస్తూ వస్తున్న ఫాసిస్ట్ శక్తులు ఇప్పుడిక పూర్తిగా ముసుగుతీసి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న బరితెగింపు మన కళ్లకు కడుతోంది.
సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా నాటి యూపీఏ ప్రభుత్వం విప్లవాత్మక పంథాలో తీసుకొచ్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ పథకం ఊపిరి తీసే సాహసానికి ఒడిగట్టారు. పార్లమెంట్ సాక్షిగా ‘ఇది గుంతలు తీసే పథకం’అని ప్రధాని నరేంద్ర మోదీ తన అక్కసు వెళ్లగక్కిన దశాబ్ద కాలపు కక్షను వారి ప్రభుత్వం ఈ విధంగా తీర్చుకుంది. ఇది ప్రమాదకర ధోరణి. ముందు ఇందిరాగాంధీని విమర్శిస్తూ వచ్చి, ఆ తర్వాత నెహ్రూని నిరంతరం నిందిస్తూ వచ్చి... చివరకు గాంధీజీపైబడిన దుర్మార్గులు వీరు.
గాడ్సే ఆదర్శంగా...
వందేళ్ల భారత స్వాతంత్ర్యోద్యమంలో ఊరు, పేరు లేనివారు నేడు ‘దేశ భక్తులు’గా జబ్బలు చరుచుకుంటున్నారు. చివరకు మహాత్మా గాంధీని కూడా దేశ వ్యతిరేకిగా చిత్రించే నీచమైన సాహసానికి తలపడుతున్నారు. పట్టపగలు, జనం మధ్య జాతిపితను హతమార్చిన నాథూరామ్ గాడ్సే వీరికి ఆదర్శమయ్యాడు. పేదలకు జీవనోపాధిని హామీ ఇచ్చేలా ఒక గొప్ప సంకల్పంతో రెండు దశాబ్దాలుగా ఈ దేశ జీవనగతిని మారుస్తున్న పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించే ప్రయత్నమే తప్పు.
అటువంటిది ఆ పేరులోకి పరోక్షంగా నాథూరామ్ గాడ్సే పేరును (వీబీ జీ ‘రామ్ జీ’) తెచ్చే కుయుక్తిని ఈ దేశ ప్రజలు క్షమించరు. పేరే కాదు ఆత్మనూ చంపారు. కొవిడ్ మహమ్మారితో సహా ఎన్నో కష్టకాలాలలో చట్టబద్ధంగా పనికల్పించి తిండిపెట్టి పేద కుటుంబాలను ఆదుకున్న గొప్ప పథకం ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి (ఎమ్జీ నరేగా). చిన్న వయసు నుంచే ప్రజా జీవితంలోకి క్రియాశీలకంగా ఉన్న నాకు బాగా గుర్తుంది.
2006 ఫిబ్రవరి 2వ తేదీన మా (ఉమ్మడి ఏపీ) అనంతపురం జిల్లాకు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ స్వయంగా వచ్చి ఈ పథకాన్ని ప్రారంభించిన సన్నివేశం నా స్మృతిపథంలో మెదలుతోంది. ‘నరేగా’ ఒక చట్టంగా తీసుకురావడానికి ముందు దేశవ్యాప్తంగా ఎంతో విస్తృతమైన చర్చ జరిగింది.
గ్రామాల్లోనే భారతీయాత్మ
‘జాతీయ సలహా మండలి’ (ఎన్‌ఏసి)లోని వివిధ పార్టీల, వివిధ రంగాల ప్రముఖుల సలహాలు, సంప్రదింపులతో ఈ చట్టాన్నొక ‘మానవీయ కోణం’లో ఆవిష్కరించి, అమలుపరిచారు. అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన సమాజాలు పశ్చిమాన, జపాన్, కొరియా వంటి దేశాలు తూర్పున ఆర్థికమాంద్యంతోనో, కొవిడ్ తోనో అల్లాడిన కాలంలోనూ భారత్ కాస్త ఉపశమనం, ఊరటతో నిలబడ గలిగిందంటే.. ‘ఉపాధి హామీ’ వంటి గొప్ప పథకాలు, ప్రజాహిత దృక్పథాల వల్లే.
అటువంటి స్ఫూర్తికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం గండి కొడుతోంది. ‘భారతీయాత్మ గ్రామాల్లోనే ఉంది’ అన్న మహాత్ముడి మాటలే ప్రేరణగా చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆయన పేరు కన్నా మరేదీ తగదన్న ఉద్దేశ్యంతోనే ‘యూపీఏ’ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా గాంధీజీపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం తలపెట్టిన ఫాసిస్ట్ శక్తులు ఇప్పుడు ఏకంగా ఆయన పేరును తొలగించే దుశ్చర్యకు తలపడ్డారు.
ఇంకొక దుర్మార్గమేంటంటే... ‘నరేగా’ను పూర్తిగా ఎత్తేసి, దానిస్థానంలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం పేదల ప్రయోజనాలకు విరుద్దంగా, కష్టసాధ్యంగా ఉంది. పేదల ఉపాధిపరంగా ‘డిమాండ్ ఆధారిత’ చట్టం స్థానంలో ఇప్పుడు ప్రభుత్వపరంగా ‘సరఫరా ఆధారిత’ చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నం పేదల ప్రయోజనాలకు విరుద్ధం. అంటే, ఇప్పటిదాకా నిరుపేదల హక్కుగా ఉన్న ఉపాధి హామీ ఇకపై ప్రభుత్వాల, పాలకుల ‘దయ’, ‘వెసులుబాటు’గా ఉంటుందన్న మాట. ఇది బీజేపీ పాలకుల ఇన్నాళ్ల అక్కసుకు ప్రతిరూపం.
పల్లె ప్రగతికి వెన్నుపోటు
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింప జేసిన కొత్త చట్టపు బిల్లులోని అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. రేపు ఇదే చట్టమై వస్తే ఇన్నాళ్లూ.. పేదల ఉపాధికి, హక్కుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి కేంద్ర ప్రభుత్వం దయపైన, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడాల్సిన దుస్థితి దాపురిస్తుంది.
రాబోయే కొత్త చట్టం సెక్షన్ 5 ప్రకారం వ్యవసాయ పనుల కాలంలో 60 రోజులపాటు ఉపాధి హామీకి కచ్చితమైన సెలవు కాలంగా పరిగణిస్తారు. పెత్తందార్లు, పెట్టుబడి భూస్వాములతో బేరమాడే శక్తి కూలీలకు హరించుకుపోతుంది. వారు ఎంత కూలి ఇస్తే అంతకు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పథకం వ్యయభారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇదివరకు 90:10 ఉండగా.. ఇప్పుడు 60:40గా మార్చడం కూడా పేదల వ్యతిరేక చర్యే.
ఇప్పటివరకు దేశంలోని అన్ని ప్రాంతాల పేదలకు ఏటా కనీసం వంద రోజులకు తగ్గకుండా పని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత, పేద ప్రజల హక్కు. ఇప్పుడలా కాదు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాల్లోనే కొత్త చట్టం అమలవుతుంది. అక్కడివారికే పనికి హామీ, అవకాశం లభిస్తుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వందే నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ అధికారమూ లేదు. సెక్షన్ 5(1) ఇదే చెబుతోంది.
పని అంతటా కల్పించడం, పని కల్పించలేనిచోట నిరుద్యోగ భృతి కల్పించడం అన్నది ‘నరేగా’లో ఉంది. కానీ, ఇవేవీలేని కొత్త చట్టం దేశంలోని 12 కోట్ల ‘ఉపాధి హామీ’ కార్డులు కలిగిన కుటుంబాలకు అశనిపాతంలా మారనుంది. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక సాకు చూపుతూ క్రమంగా కేంద్ర కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్న ఎన్డీఏ పాలకులు ఇప్పుడీ భారాన్ని రాష్ట్రాల మీదకు నెట్టడం మరో దుర్మార్గం. కేంద్ర కేటాయింపులకు మించి వ్యయమైన చోట దాన్ని రాష్ట్రాలే భరించాలని తాజా బిల్లులో మెలిక పెట్టడమే పేదల పట్ల వీరికి గల నిబద్ధతకు నిదర్శనం.
ప్రమాదస్థితిలో అంతరాలు
గత పన్నెండేళ్లుగా దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ధనికులు మరింత సంపన్నులు అవుతుంటే పేదలు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. బీజేపీ నేతృత్వపు ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు, కీలక నిర్ణయాలు అంబానీ, అదానీ వంటి ఎందరో కార్పొరేట్లు, సంపన్నులకు అనుకూలంగా.. పేద, బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకంగానూ ఉంటున్నాయి.
అందుకే దేశంలో సామాజిక, ఆర్థిక అంతరాలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఇటీవలి ‘వరల్డ్ ఎకనామిక్ సమిట్’ ముందర ఆక్స్‌ఫామ్ ఇచ్చిన నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడి చేసింది. దేశ జనాభాలో పై వరుసలోని 10 శాతం మంది 70శాతంపైగా దేశ సంపదను అనుభవిస్తుంటే, అడుగున ఉన్న 50శాతం దేశ జనాభా వద్ద నున్న జాతీయ సంపద 10శాతంలోపేనని ఇటువంటి పలు అధ్యయన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడమే కాకుండా సదరు పథకాన్ని, దాని స్ఫూర్తినీ భగ్నం చేసిన ఎన్డీఏ పాలకులు తమ పేదల వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. గాంధీజీ పేరు తొలగించడం గ్రామీణ వికాసానికి ఆయన కన్న కలలను భగ్నం చేసే దుర్మార్గమైన చర్య. ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపమన్న అహింసామూర్తి గాంధీజీ వీరి దుర్మార్గాలను పైలోకాల నుంచి మన్నించగలరేమో కానీ, ఈ దేశ ప్రజలు మాత్రం క్షమించరుగాక క్షమించరు.
- పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా,బలహీన వర్గాల సంక్షేమశాఖల మంత్రి
