- మున్సిపాలిటీల్లో దావతుల జోరు
- నగదు, నజరానాల పంపిణీకి ఏర్పాట్లు
కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. వారం రోజులుగా వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేసిన అభ్యర్థులు పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలపై ఫోకస్ పెట్టారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలు ఉన్నాయి. బుధవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి సైలెన్స్ ప్రచారం మొదలైంది. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు, కొన్ని వార్డుల్లో ఇండిపెండెంట్లు ప్రలోభాలను షూరు చేశారు. మరో వైపు దావతులు జోరందుకున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డులు ఉండగా మెజార్టీ వార్డుల్లో సోమవారం సాయంత్రం నుంచి ఓటర్లకు తాయిలాలు అందుతున్నాయి.
కొన్ని చోట్ల ఇంటింటికి.. మరి కొన్ని చోట్ల గ్రూపులుగా ..
కామారెడ్డి టౌన్లోని కొన్ని వార్డుల్లో కొందరు ఇండ్లకు నేరుగా మద్యం సీసాలు పంపిణీ చేస్తున్నారు. కొన్ని వార్డుల్లో మాత్రం ఓటర్లను గ్రూపులుగా విభజించి సిట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గత 2 రోజులుగా దావతులు ఎక్కువగా నిర్వహిస్తుండగా సోమవారం రాత్రి ఇవి రెట్టింపు అయ్యాయి. ఆయా వార్డుల్లో ఒక్కో గ్రూపులో 10 మంది, 15 మందిని, 20 మందిని ఒక్కో చోట కూర్చుండబెడుతున్నారు. దావతుల నిర్వహణకు ప్రతి అభ్యర్థి తమ అనుచరులకు బాధ్యతలు అప్పగించారు.
దావతు చివరి టైంలో సదరు అభ్యర్థి వచ్చి తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఒక రోజుకు ఒక గ్రూప్ సిట్టింగ్‌కు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతోంది. ఒక్కో వార్డులో 10 నుంచి 15 గ్రూపుల వరకు కూర్చుంటున్నాయి. గ్రూపుగా ఏర్పాటు చేసే దావతు దగ్గరకు రాలేని వారికి నేరుగా ఇంటికే మద్యం సీసా, స్నాక్స్ పంపిణీ చేస్తున్నారు. మద్యం దావతులు ఎక్కువగా కొత్త టౌన్ పరిధిలోని పలు వార్డులతో పాటు, దేవునిపల్లి, లింగాపూర్ పరిధిలోని వార్డుల్లో ఎక్కువగా ఉన్నాయి.
కాస్లీ మందు
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ మంది కాస్లీ మందు వైపే మొగ్గు చూపుతున్నారు. నార్మల్ మందు ఇస్తే చాలా వార్డుల్లో తీసుకొవట్లేదని అభ్యర్థులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. ఇందులో విద్యానగర్, ఆశోక్‌నగర్, ఎన్జీవోస్ కాలనీ, కాకతీయ నగర్, వివేకానంద కాలనీ, దేవునిపల్లి, కాకతీయ నగర్, హౌజింగ్ బోర్డు కాలనీలోని పలు వార్డుల్లో దావతులను కాస్లీ మందుతో ఏర్పాటు చేస్తున్నారు.
కొందరు అభ్యర్థులు మద్యం సిట్టింగ్‌ల కోసం తమ అనుచరులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. వార్డులో రాత్రి ఎక్కడ దావతు ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని పొద్దునే ఓటర్లకు చెబుతున్నారు. గల్లీల వారీగా గ్రూపులుగా విభజిస్తున్నారు. ఇంకా కొందరు అభ్యర్థులు బార్లకు పంపిస్తున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుందలో కూడా దావతులు కొనసాగుతున్నాయి.
నగదు, వస్తువులు
కామారెడ్డిలోని కీలకమైన వార్డుల్లో ప్రతి ఓటరుకు నగదు పంపిణీకి ప్లాన్ చేశారు. మంగళవారం ఈ నగదు పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంబంధిత వార్డులో ఉన్న ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా నగదు పంపిణీకి కావాల్సిన పైసలు రెడీ చేసి పెట్టుకున్నారు. ఒకేవ్యక్తి కాకుండా గల్లీల వారీగా బాధ్య తలు ఇచ్చారు. కొత్త టౌన్లోని ఓ వార్డులో ఓటుకు రూ.1500 నుంచి రూ.2వేలు ఇచ్చేందుకు ఓ పార్టీ అభ్యర్థి రడీ అయ్యారు. ఓ వార్డులోని ప్రధాన పార్టీ అభ్యర్థి సంఘాలకు వంట సామగ్రి, ఇతర వస్తువులు ఇచ్చారు. ఇంకో వార్డులో ఓ అభ్యర్థి యూత్‌కు వాచ్‌లు ఇవ్వనున్నారు.
