- ఒక్క కార్పొరేషనూ చేజారొద్దు: మంత్రులతో జూమ్‌లో సీఎం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ఏడు కార్పొరేషన్లలో ఏ ఒక్కటీ చేజారొద్దని.. గజ్వేల్, సిరిసిల్లతో పాటు మున్సిపాలిటీలన్నింటినీ గెలవాల్సిందేనని మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ముందు 48 గంటలు కీలకమని, పోల్ మేనేజ్మెంట్ పై అందరూ స్పెషల్ ఫోకస్పెట్టాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉదయం మంత్రులతో సీఎం జూమ్ లో సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాగిన తీరు, జనం నుంచి వచ్చిన స్పందన, పార్టీ ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్ ల పనితీరుపై సీఎం ఆరా తీశారు. మెజార్టీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయని.. కానీ, గెలుస్తున్నామనే ధీమాలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్దన్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లలో ఏ ఒక్కటీ చేజారొద్దని, కాంగ్రెస్బలహీనంగా ఉందన్న చోట పోల్మేనేజ్మెంట్ బాగా చేయాలని సూచించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో గెలిచితీరాల్సిందేనన్నారు. ఆయా చోట్ల కాంగ్రెస్ తో బీజేపీ పోరాడుతున్న తీరును, ఆ పార్టీ బలాలు, బలహీనతల గురించి సీఎం రేవంత్ మంత్రులను ఆరా తీసినట్టు సమాచారం. ఇదే సమయంలో గజ్వేల్, సిరిసిల్ల మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ బలాబలాలపై చర్చ జరిగినట్టు తెలిసింది.
కాగా, పోలింగ్ కు కొద్ది గంటలు మాత్రమే ఉండడంతో ప్రతి నిమిషాన్ని కాంగ్రెస్ గెలుపునకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేయాలని సీఎం సూచించారు. ఇటు ఎమ్మెల్యేలను, అటు డీసీసీ చీఫ్ లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రతి ఓటరు బూత్ కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని,ఈ మేరకు బూత్ స్థాయిలో పార్టీ కో ఆర్డినేటర్లు, కార్యకర్తలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు.
