- ఖర్గే చాంబర్లో ఉదయం కూటమి ఎంపీల భేటీ
- అధికార పక్షం వైపు స్పీకర్ మొగ్గు చూపుతున్నారని ఆరోపణ
- లోక్ సభ ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వడంలేదని విమర్శలు
- కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పైనా మండిపడుతున్న ప్రతిపక్షాలు
- తమకు మాట్లాడే అవకాశం ఇస్తే చర్చలో పాల్గొంటామన్న రాహుల్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను మాట్లాడనీయకపోవడం, అలాగే 8 మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి డ్రాఫ్ట్ సిద్ధం చేసినట్లు, విపక్ష ఎంపీలు 103 మంది సంతకాలు చేశారని సమాచారం. సోమవారం లోక్ సభ గందరగోళం మధ్య వాయిదా పడగా.. మధ్యాహ్నం లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి ఇండియా కూటమి ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. స్పీకర్ ఛాంబర్ లో కొద్ది నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో.. సభలో మాట్లాడేందుకు తమకు మైక్ ఎందుకు ఇవ్వడంలేదని రాహుల్ గాంధీ అడిగారు. "ప్రధానికి ముప్పు ఉందని ప్రచారం చేస్తున్నారు, అదే నిజమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయండి" అని ఆయన సవాల్ విసిరారు. గత వారం భారత్ చైనా సరిహద్దు అంశంపై రాహుల్ మాట్లాడడంపై సభలో గొడవ రేగిన విషయం తెలిసిందే. ఆ విషయంపై మాట్లాడకుండా రాహుల్ ను అడ్డుకోవడం, మైక్ కట్ చేయడంతో అప్పటి నుంచి సభ సాగడంలేదు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పిస్తే చర్చల్లో పాల్గొనేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. ప్రభుత్వంతో సంప్రదించాక ఈ విషయంపై క్లారిటీ ఇస్తానని జవాబిచ్చారు. అనంతరం ఇండియా కూటమి ఎంపీలు రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో భేటీ అయ్యారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చించారు. అయితే, స్పీకర్ స్పందనను బట్టి మంగళవారం ఉదయం మరోమారు ఖర్గే ఛాంబర్ లోనే భేటీ అయి తుదినిర్ణయం తీసుకోవాలని నిశ్చయించారు.
ఆర్టికల్ 94 సీ ప్రకారం నోటీసు..
లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాసానికి సంబంధించి ఆర్టికల్ 94 సి ప్రకారం నోటీసులు జారీ చేసే వీలుంటుంది. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ ప్రతిని ఇప్పటికే సిద్ధం చేయగా.. మొత్తం 103 మంది ఎంపీలు సంతకాలు చేశారు. స్పీకర్ పై అవిశ్వాసానికి ప్రధాన కారణంగా సభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించకపోవడమేనని ఎంపీలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. రాహుల్ కు మైక్ ఇవ్వకపోవడం, పార్టీకి చెందిన 8 మంది ఎంపీల సస్పెన్షన్ అంశాలపై పట్టుబడుతోంది. ‘సర్’ పై తృణమూల్ కాంగ్రెస్, మాల్వా రాణి అహల్యాబాయి హోల్కర్‌కు జరిగిన అవమానం గురించి చర్చించాలని సమాజ్‌వాదీ పార్టీ కోరుతున్నాయి.
