ఇటీవల ఫోరెన్సిక్ ల్యాబ్‌లో సంభవించిన అగ్నిప్రమాదం సున్నితమైన మౌలిక వసతుల భద్రతపై శాస్త్రీయ పునఃసమీక్షను అనివార్యం చేసింది. దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే వ్యవస్థలోని పలు కీలక లోపాలు స్పష్టమవుతున్నాయి. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల అమలులో జరిగిన వైఫల్యాలే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా గుర్తించవచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యవస్థలు స్పందించిన తీరు, రక్షణ యంత్రాంగాల వైఫల్యం ఫోరెన్సిక్ మౌలిక వసతుల నాణ్యతను ప్రశ్నార్థకం చేశాయి.
నేర నిర్ధారణ ప్రక్రియలో ఫోరెన్సిక్ ప్రయోగశాల వెన్నెముక వంటిది. ఇది సంపూర్ణంగా ఇంజనీరింగ్‌తోపాటు అంతర్జాతీయ నియమ, నిబంధనలతో ముడిపడి ఉన్న విధి. చట్టపరమైన నిరూపణకు అవసరమైన ఆధారాలు ఏ రకమైన ప్రకృతి లేదా మానవ తప్పిదాల వల్ల కలిగే ప్రమాదాలకు గురికాకూడదు. ఇందుకోసం 'ISO/IEC 17025' వంటి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయోగశాల నిర్మాణం జరగడం అత్యవసరం.
ప్రయోగశాల రూపకల్పనలో భద్రతతోపాటు కచ్చితత్వం ప్రధాన ప్రాతిపదికలుగా ఉండాలి. భవన నిర్మాణం నుంచి ‘ఆధారాల భద్రత’ వరకు ప్రతిదశలోనూ శాస్త్రీయ దృక్పథం ప్రతిబింబించాలి. న్యాయవ్యవస్థకు అందించే సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ భౌతిక నాశనానికి గురికాకూడదు.
ఒక ఆదర్శవంతమైన ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్మాణం.. నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ( ఎన్‌ఎఫ్‌పీఏ 150) ప్రమాణాల ప్రకారం గోడలు అలాగే పైకప్పులు నిర్మాణానికి ఉపయోగించే పదార్థాలు కనీసం రెండు నుంచి నాలుగు గంటలపాటు అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రేటింగ్ కలిగి ఉండటం ముఖ్యం. 'ఇంట్యూమెసెంట్' పెయింట్స్‌తోపాటు ఫైర్-రేటెడ్ గ్లాస్ వాడకం ద్వారా మంటలు ఒక విభాగం నుంచి మరొక విభాగానికి వ్యాపించకుండా నియంత్రించవచ్చు.
నీటి ఆధారిత స్ప్రింక్లర్ వ్యవస్థలు ఫోరెన్సిక్ పరికరాలకు అలాగే రసాయనాలకు నష్టం కలిగించే అవకాశం ఉన్నందున 'ఎఫ్ఎం-200' లేదా 'ఇనర్ట్ గ్యాస్ సప్రెషన్' వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇవి ఆక్సిజన్ స్థాయిని తగ్గించకుండానే మంటలను ఆర్పే సామర్థ్యం కలిగి ఉంటాయి. మంటలు ఆర్పే క్రమంలో సాక్ష్యాధారాలు తడవకుండా ఉండటం ఈ గ్యాస్ వ్యవస్థల ప్రధాన ఉద్దేశం. ప్రతి గదికి ప్రత్యేకమైన ఫైర్ ఎగ్జిట్ మార్గాలు ఉండాలి.
విద్యుత్ ఇంజినీరింగ్‌తోపాటు రసాయన నిల్వ ప్రొటోకాల్స్
ప్రయోగశాలల్లో సంభవించే అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు. వైరింగ్ వ్యవస్థలో ఫైర్ రిటార్డెంట్లో స్మోక్ కేబుల్స్ వాడటం అత్యవసరం. ప్రతి విభాగంలో సర్క్యూట్ బ్రేకర్లతోపాటు లోడ్ బ్యాలెన్సింగ్ యంత్రాంగాలు కచ్చితత్వంతో పనిచేయాలి. రసాయన శాస్త్ర విభాగాలు అత్యంత ప్రమాదకరమైన జ్వలనశీల పదార్థాలను కలిగి ఉంటాయి. వీటి నిల్వ కోసం 'ఎఎస్హెచ్ఏ' నిబంధనల ప్రకారం ప్రత్యేకమైన వెంట్ కంట్రోల్డ్ కేబినెట్స్ అవసరం.
ఒక రసాయనం మరొకదానితో చర్య జరపకుండా ఉండేలా వేరువేరుగా భద్రపరచాలి. గాలిలో కలిసే రసాయన ఆవిరిని ఎప్పటికప్పుడు తొలగించేలా సెన్సర్ ఆధారిత ఫ్యూమ్ హుడ్స్ అలాగే హై-ఎఫిషియన్సీ పర్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా అంతర్గత భద్రతను మెరుగుపరచవచ్చు. రసాయన ప్రయోగశాలల్లో వాయు ప్రసరణ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షణలో ఉండాలి. విద్యుత్ ప్యానెల్స్ వద్ద ఆటోమేటిక్ కార్బన్ డయాక్సైడ్ ఎక్స్టింగ్విషర్లు అమర్చడం శ్రేయస్కరం. విద్యుత్ లైన్ల సామర్థ్యాన్ని క్రమపద్ధతిలో తనిఖీ చేయాలి.
జల విపత్తుల నుంచి రక్షణ
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫోరెన్సిక్ ప్రయోగశాలలు ఉన్నప్పుడు ప్రత్యేక సివిల్ ఇంజినీరింగ్ జాగ్రత్తలు తీసుకోవాలి. పునాదుల స్థాయిలో వాటర్ ప్రూఫింగ్ తోపాటు కీలకమైన సాక్ష్యాల భద్రతా గదులను భూగర్భ స్థాయిలో నిర్మించకూడదు. డిజిటల్ ఫోరెన్సిక్ విభాగాలు అలాగే సర్వర్ గదులు నీరు చేరే అవకాశం లేని ఎత్తైన ప్రదేశాల్లో ఉండాలి. తేమశాతం పెరగడం వల్ల డీఎన్ఏ నమూనాలు అలాగే జీవసంబంధిత ఆధారాలు పాడయ్యే అవకాశం ఉంటుంది.
దీనిని అరికట్టడానికి అత్యాధునిక హ్యుమిడిటీ కంట్రోల్ సిస్టమ్స్ నిరంతరం పనిచేయాలి. వరదలు లేదా భారీ వర్షాల సమయంలో ప్రయోగశాల లోపలికి నీరు రాకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టంగా రూపొందించాలి. 'ISO 27001' ప్రమాణాల ప్రకారం డేటా సెంటర్లను భౌతిక జల విపత్తుల నుంచి రక్షించే ఏర్పాట్లు ఉండాలి. సెన్సర్ల ద్వారా నీటి లీకేజీలను తక్షణమే గుర్తించే వ్యవస్థలు ఉండాలి.
భూకంప నిరోధక వ్యూహాలు
సిస్మిక్ జోన్ల వర్గీకరణ ప్రకారం ప్రయోగశాల భవనాలు భూకంపాలను తట్టుకునేలా నిర్మించాలి. బేస్ ఐసోలేషన్ టెక్నాలజీ ద్వారా భూకంప ప్రకంపనలు భవనానికి చేరకుండా నియంత్రించవచ్చు. ప్రయోగశాలలోని ఖరీదైన సూక్ష్మదర్శినిలు అలాగే స్పెక్ట్రోమీటర్లు వంటి భారీ పరికరాలను నేలకు లేదా గోడలకు ప్రత్యేక యాంకరింగ్ పద్ధతులతో బిగించాలి. ప్రకంపనల సమయంలో ఇవి పడిపోవడం వల్ల భారీ ఆర్థికనష్టంతోపాటు ఆధారాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది.
గ్యాస్ పైపులైన్లు అలాగే విద్యుత్ లైన్లు భూకంపం రాగానే స్వయంచాలకంగా నిలిచిపోయేలా ఆటో-షటాఫ్ వాల్వ్స్ అమర్చడం ద్వారా తదుపరి ప్రమాదాలను నివారించవచ్చు. భారీ యంత్రాల చుట్టూ ప్రకంపనల తీవ్రతను తగ్గించే షాక్ అబ్జార్చర్లు అమర్చాలి. భూకంపం సంభవించినప్పుడు ప్రయోగశాల వాయు ప్రసరణ వ్యవస్థలో లీకేజీలు రాకుండా జాగ్రత్తపడాలి.
చైన్ ఆఫ్ కస్టడీ
ఏ రకమైన విపత్తు సంభవించినా 'చైన్ ఆఫ్ కస్టడీ' దెబ్బతినకూడదు. ప్రతి సాక్ష్యం భౌతికంగా మాత్రమే కాకుండా డిజిటల్ రూపంలో కూడా రికార్డ్ చేయాలి. క్లౌడ్ ఆధారిత డిజాస్టర్ రికవరీ ప్రొటోకాల్స్ ద్వారా డేటా బ్యాకప్ నిరంతరం జరగాలి.
ప్రయోగశాల దెబ్బతిన్నప్పటికీ కేసు విచారణ ఆగకుండా ఉండేందుకు 'ISO 22301' ప్రకారం బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్ సిద్ధంగా ఉండాలి. నమూనాల సేకరణ నుంచి నివేదిక సమర్పణ వరకు ప్రతి దశలో కలుషితం కాకుండా ఉండేలా నియంత్రిత వాతావరణం ఉండాలి. విపత్తు సమయాల్లో అత్యవసర విద్యుత్ సరఫరా కోసం రిడండెంట్ పవర్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం వల్ల శీతలీకరణ యంత్రాల్లో ఉన్న జీవ నమూనాలు పాడవకుండా ఉంటాయి. ఆధారాల సేకరణలో వాడే ప్యాకేజింగ్ మెటీరియల్ కూడా అగ్ని అలాగే నీటి నిరోధక సామర్థ్యం కలిగి ఉండటం మేలు.
సైబర్ రక్షణ వ్యవస్థ
ఆధునిక ఫోరెన్సిక్ వ్యవస్థల్లో డిజిటల్ డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. భౌతిక దాడులతో పాటు సైబర్ దాడులు కూడా సాక్ష్యాధారాలను మార్చే ప్రమాదం ఉంది. 'ISO 27001' నిబంధనల ప్రకారం ప్రయోగశాల నెట్‌వర్క్ వ్యవస్థను అత్యంత భద్రంగా రూపొందించాలి. డేటా ఎన్‌క్రిప్షన్ పద్ధతుల ద్వారా కీలక సమాచారం బయటకు వెళ్లకుండా చూడవచ్చు.
సర్వర్ గదుల్లో ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలు విఫలమైనప్పుడు స్వయంచాలకంగా బ్యాకప్ సర్వర్లు ప్రారంభమయ్యేలా ప్రొటోకాల్స్ ఉండాలి. డిజిటల్ సాక్ష్యాల క్లోనింగ్ ప్రక్రియలో ఎటువంటి డేటా నష్టం జరగకుండా నిరంతర పర్యవేక్షణ అవసరం. ఆఫ్‌సైట్ డేటా స్టోరేజ్ పద్ధతుల ద్వారా విపత్తు సమయంలో కూడా సమాచారాన్ని తిరిగి పొందవచ్చు.
సాంకేతిక పర్యవేక్షణ
ఫోరెన్సిక్ ప్రయోగశాలల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం చట్టపరమైన బాధ్యత. కేవలం భవన నిర్మాణం మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా నిర్వహించే సేఫ్టీ ఆడిట్స్ వ్యవస్థలోని లోపాలను గుర్తించడానికి సహాయపడతాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం బయోసేఫ్టీ లెవల్స్ (BSL-1 నుంచి BSL-4) వర్గీకరణ చేయడం ద్వారా వైరస్లు అలాగే బ్యాక్టీరియాల వంటి ప్రమాదకర కారకాలు బయటకురాకుండా చూడవచ్చు.
ప్రమాదాలు సంభవించినప్పుడు స్పందించే తీరుపై సిబ్బందికి నిరంతర శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించవచ్చు. ప్రతి ప్రయోగశాల అధికారి భద్రతా నిబంధనల అమలులో జవాబుదారీగా ఉండాలి. ఈ రకమైన సమగ్ర ఇంజినీరింగ్ విధానం మాత్రమే న్యాయవ్యవస్థకు నాణ్యమైన ఫోరెన్సిక్ సేవలను అందించగలదు.
- డా.కట్కూరి, సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణుడు-
