- ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5వేలు, లిక్కర్
- ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పంపిణీపై దృష్టి పెట్టిన ఇండిపెండెంట్లు
- చివరి రోజు హోరెత్తిన ప్రచారం
నల్గొండ/యాదాద్రి, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. వారం రోజులుగా గల్లీల్లో వినిపించిన మైకుల హోరు, పార్టీల ప్రచార జోరుకు తెరపడింది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.13న కౌంటింగ్ నిర్వహిస్తారు. నల్గొండ కార్పొరేషన్ తో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని11 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఓటర్లను సంతృప్తి పర్చేందుకు అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. జోరుగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తుండగా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
చివరి రోజు జోరుగా ప్రచారం..
చివరి రోజైన సోమవారం మున్సిపాలిటీల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. నల్గొండ కార్పొరేషన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, నేరేడుచర్ల, కోదాడ, హుజూర్ నగర్ మున్సిపాలిటీల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ప్రచారం చేశారు. హాలియాలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ప్రచారం నిర్వహించగా, దేవరకొండలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, నాగార్జునసాగర్ లో ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు.
ప్రలోభలకు తెర లేపిన్రు..
ప్రచారం ముగియడంతో అభ్యర్డులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లకు కాస్ట్లీ మద్యం, ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేయడంతో పాటు చికెన్, మటన్, దావత్ లు ఇస్తున్నారు. కుల సంఘాలు, అపార్ట్మెంట్ల వారికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. శివారు వార్డుల్లో గుడులు కట్టిస్తామని వాగ్ధానాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు రెబల్స్, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎక్కడా తగ్గకుండా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారు.
సూర్యాపేట శివారు వార్డులోని ఇండిపెండెంట్ అభ్యర్ది ఓటుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేయడం గమనార్హం. మద్యం దుకాణాలు బంద్ కాక ముందే పలువురు నాయకులు మద్యం నిల్వ చేసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన వలస ఓటర్లను రప్పించేందుకు ప్రత్యేకంగా కార్లు, వెహికల్స్ ఏర్పాటు చేశారు.
యాదాద్రిలో జోరుగా ప్రచారం..
యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ తరపున మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్పర్సన్బండ్రు శోభారాణి, బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ తరపున ఆలేరు, భువనగిరి ఎన్నికల ఇన్చార్జీలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలో ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో 104 వార్డులు ఉన్నాయి. ఇందులో చౌటుప్పల్‌లోని 17వ వార్డు, యాదగిరిగుట్టలోని 10వ వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 102 వార్డుల్లో 353 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
