- మరో 20 మందికి గాయాలు
పర్వతగిరి, వెలుగు : ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొట్టడంతో రెండేండ్ల చిన్నారితో పాటు ఓ వ్యక్తి చనిపోగా, మరో 20 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్డు సోమవారం జరిగింది.
ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌లోని శంభునిపేటకు చెందిన కొందరు వ్యక్తులు అన్నారం వెళ్లి కందూరు ముగించుకొని ట్రాక్టర్‌లో తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో సంగెం మండలం తీగరాజుపెల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన రెండు బస్సులు కొంకపాక, చౌటపల్ల, సోమారం, జమాల్‌పురం గ్రామాల్లో స్టూడెంట్లను ఎక్కించుకొని వెళ్తున్నాయి. పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఓ బస్సు మరో బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ఇంజిన్, ట్రాలీ రెండుగా విడిపోయాయి.
ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న ఇస్మాయిల్ (55), రేహాన్ (2) అక్కడికక్కడే చనిపోగా మరో 10 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన బస్సులో 40 మంది స్టూడెంట్లు ఉండగా.. ఇందులో 10 మంది గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాయపడిన వారిని 108లో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
