రెండు సంవత్సరాల సుదీర్ఘ ఎదురుచూపుల తరువాత డిసెంబర్ నెలలో గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు పార్టీ రహితంగా జరగాల్సి ఉన్నా అలా కాలేదు. సుమారు 1200 గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవ ఎన్నిక జరుగగా వీటిలో చాలామటుకు సర్పంచ్ పదవికి వేలం వేయడం జరిగింది. సుమారు రూ. 20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పాటపాడి వేలంలో పదవి దక్కించుకున్నారు.
రెండు ప్రధాన పార్టీలు ఓటుకు వేయి నుంచి ఐదువేల వరకు బాహాటంగా పంచినారు. ఇక మద్యం, చీరలు, ఉంగరాలు ఇలా రకరకాలుగా ప్రలోభాలతో ఓటరును ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. ఇంత జరుగుతున్నా ఎన్నికల యంత్రాంగం కళ్లు మూసుకుంది.
అక్కడక్కడా కోడ్ ఉల్లంఘన అంటూ కేసులు నమోదు చేవారు, కానీ, డబ్బులు ఇతర ప్రలోభాలను ఎన్నికల సంఘం ఆపలేకపోయింది. ఎన్నికలు ఫ్రీగా జరిగినా ఫెయిర్‌గా మాత్రం జరగలేదు. దీనితో ఓటు అమ్ముకొనడం అనే ఒక దుష్ట సంప్రదాయం ఏర్పడింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులలో కొద్దిమంది తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు.
ఇంకా కొందరు సర్పంచ్‌లు గెలవడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టారు. కొన్ని గ్రామాలలో రూ.25 లక్షల వరకు ఖర్చు అయితే ఇంకా కొన్ని గ్రామాలలో రూ. 60 లక్షల వరకు ఖర్చు చేసి, ఇదంతా ఒక పెట్టుబడిగా భావించి వచ్చే 5 ఏళ్లలో ఈ పెట్టుబడికి రెండింతలు సంపాదించాలనే కోరికతో ఉన్నారు.
29 అంశాల పనులు పంచాయతీలకు బదలాయించాలి
గ్రామ ప్రజలు, అధికారుల నిఘా లేనట్లయితే పంచాయతీకి వచ్చే నిధులలో సింహభాగం సర్పంచ్ జేబులోనికిపోయే ప్రమాదం ఉంది. భారత రాజ్యాంగం అనుకరణ (ఆర్టికల్) 243 - G ప్రకారం గ్రామాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా ఉండాలి. పదకొండవ షెడ్యూల్లో సూచించిన ప్రకారంగా 29 అంశాలు ముఖ్యంగా వ్యవసాయం, చిన్న నీటి పారుదల, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ, కుటీర పరిశ్రమలు, గ్రామీణ గృహనిర్మాణ, తాగునీరు, మార్కెట్‌లు, డ్రైనేజీ వంటి అంశాలు గ్రామపంచాయతీల పరిధిలోకి వస్తాయి, అయితే ఇట్టి 29 అంశాల పనులు రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు బదలాయించాలి.
కానీ, ఇంతవరకు పూర్తిగా బదలాయింపు కాలేదు. అలాగే గ్రామాభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలతో గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారై అట్టి అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ ముందుంచి గ్రామసభ మంజూరు తరువాత అవే పనులు చేపట్టాలి. సర్పంచ్ కాని ఇతర అధికారులు కాని ప్రణాళికలో లేని పనులు మొదలుపెట్టరాదు. గత ప్రభుత్వ హయాంలో చాలామంది సర్పంచ్‌లు బడ్జెట్ లేకున్నా గ్రామంలో పనులు తమ సొంత డబ్బుతో చేయించి చివరకు నిధులు విడుదల కాక తీవ్ర ఇబ్బందులకు గురైనారు.
నిధులు విడుదల చేయాలి
ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి కేంద్రం నుంచి (15వ ఆర్థికసంఘం) నిధులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. అవి ఒకే విడతలో రాకపోవచ్చు. రాష్ట్రం నుంచి పంచాయతీలకు విడుదల చేయవలసిన నిధులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. రాజ్యాంగం అనుకరణ 243 - I ప్రకారం ప్రతి రాష్ట్రానికి కేంద్రంలో మాదిరిగానే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది.
ఈ రాష్ట్ర ఆర్థిక కమిషన్ వారు రాష్ట్రంలో వచ్చే పన్నులను రాష్ట్రానికి, గ్రామ పంచాయతీలకు పంచడానికి సూచనలు చేస్తారు. అలాగే గ్రామ పంచాయతీల ఆర్థికస్తోమత పెంచుటకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పంచాయతీలకు గ్రాంట్- ఇన్- ఎయిడ్ కింద నిధుల విడుదలకు రికమెండ్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ ఏర్పాటు చేయలేదు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిల్ వేయడం, కోర్టు వారి ఆర్డర్ ద్వారా తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత10 ఏళ్లలో కమిషన్ చేసిన రికమండేషన్‌లు ఎవరికీ తెలియదు.
ఇప్పటికైనా కమిషన్ వారు పంచాయతీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఫైనాన్స్ కమిషన్ లాగ రాష్ట్ర నిధుల నుంచి 40% నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేయడానికి రికమండ్ చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీలకు రాజ్యాంగం ప్రకారం ఒక హక్కుగా రావాలే కాని రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైన కాదు.
పంచాయతీల స్వతంత్ర ప్రతిపత్తి కోసం ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి.
- సర్పంచ్‌లకు జిల్లాల వారీగా శిక్షణా కార్యక్రమాలు, ఇందుకు ప్రతిజిల్లాలో నుంచి సంబంధిత అధికారులకు ఎన్.ఐ.ఆర్.డి.లో శిక్షణ ఇచ్చి వారు తిరిగి జిల్లాలలో సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమం చేపట్టాలి. ఇందులో సర్పంచ్‌ల అధికారాలు, బాధ్యతలు, గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారు, సామాజిక న్యాయం వంటివి ఉండాలి.
- గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారుపై శిక్షణ అలాగే ప్రణాళికను గ్రామసభ ముందుంచి గ్రామసభ అనుమతి తీసుకోవాలి. గ్రామసభకు మండల / జిల్లా స్థాయి అధికారులు హాజరై తగు సూచనలు, సలహాలు ఇవ్వాలి.
- మండలస్థాయి అధికారులు అభివృద్ధి ప్రణాళికలో సూచించిన పనులకు ఎస్టిమేట్‌లు వేసి పనుల ఆవశ్యకతను బట్టి 5 సంవత్సరములలో సంవత్సర వారీగా తీసుకోవాల్సిన పనులు, వాటికి కావలసిన బడ్జెట్ అందులో పొందుపరచాలి.
- ప్రణాళికలో లేని పనులను తీసుకోరాదు. అలాగే చేపట్టే పనులకు కావలసిన ఎస్టిమేట్ వంటివి పారదర్శకంగా ఉండాలి.
- కేరళ రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తోంది. మన రాష్ట్రం నుంచి అధికారులు అలాగే కొందరు సర్పంచులను ఆ రాష్ట్రానికి పంపి అచ్చట అమలవుతున్న పద్ధతులను అవగాహన చేసుకోవాలి.
- మహిళా సర్పంచులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టి వారిలో ఆత్మస్థైర్యం నింపాలి. మహిళా సర్పంచ్‌ల భర్తలు కాని, తండ్రి కాని ఎవరూ కూడా పంచాయతీ మీటింగులకు రాకూడదు. అలాగే పనులలో జోక్యం కలిగించుకొనకుండా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలి.
- సంక్షేమ పథకాలలో లబ్ధిదారుల ఎంపిక పంచాయతీలు చేసి గ్రామసభ ముందుంచి అనుమతి తీసుకోవాలి. దీనిలో శాసనసభ్యుల ప్రమేయం ఉండకూడదు.
- - యం. పద్మనాభరెడ్డి,అధ్యక్షుడు,ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
