జనరల్‌‌ స్థానాల్లో బీసీ విజయం

జనరల్‌‌ స్థానాల్లో బీసీ విజయం

పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక సాధారణ స్థానిక రాజకీయ సంఘటనగా చూసి పక్కకు నెట్టివేయలేని చారిత్రక సంకేతాలు. అవి రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో నిశ్శబ్దంగా,  బలంగా జరుగుతున్న లోతైన మార్పును స్పష్టంగా ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా జనరల్‌‌ స్థానాల్లో బీసీలు గెలిచిన తీరు, ఇన్నాళ్లూ ‘‘సహజాధిపత్యం’’గా ప్రచారం చేసిన ఓసీల కుల రాజకీయ మిథ్యను ధ్వంసం చేసింది. వివిధ మీడియా కథనాలలో వెలువడిన అధికారిక గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. 

బీసీలు ఇక కేవలం రిజర్వేషన్‌‌ రాజకీయాల పరిధిలో బంధించబడే సమాజంగా లేరని, వారు స్వయంగా రాజకీయ శక్తిగా మారుతున్న వర్గంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,707 సర్పంచ్‌‌ స్థానాల్లో 5,190 జనరల్‌‌ స్థానాలు ఉండగా, వాటిలో 2,738 చోట్ల బీసీలు విజయం సాధించారు. ఇది 39.5 శాతం. ఈ సంఖ్యను తక్కువగా అంచనా వేయడం రాజకీయ అజ్ఞానమే. ఎందుకంటే ఈ విజయం నెలల తరబడి జరిగిన ఉద్యమ ఫలితం కాదు.  వారం రోజుల వ్యవధిలో నోటిఫికేషన్‌‌ వచ్చాక మొదలైన ప్రచారంతోనే, పార్టీల సంపూర్ణ అండ లేకుండా, డబ్బు,  దౌర్జన్యం, అధికార యంత్రాంగం మధ్య జనరల్‌‌ స్థానాల్లో కూడా బీసీలు నిలబడి సాధించిన విజయం ఇది. 

అంటే బీసీల రాజకీయ బలం కృత్రిమంగా సృష్టించబడినది కాదు. అది సహజంగా సమాజంలో ఉన్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ, భావజాల ఉన్నతికి శక్తి.   పంచాయతీ ఫలితాలు చెబుతున్నవి ఏంటంటే, ఈ వివక్షాత్మక వ్యవస్థను అధిగమించకుండా బీసీ, అణగారిన వర్గాల రాజకీయ శక్తి వాస్తవంగా ఎదగగలదు. ఇన్నాళ్లూ బీసీలకు జనరల్‌‌లో పోటీ చేస్తే ఓడిపోతారని భయం నాటారు. 

ఇది ఓసీల కుల ఆధిపత్యాన్ని శాశ్వతమైనదిగా చూపించేందుకు నిర్మించిన రాజకీయ అబద్ధం. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆ అబద్ధాన్ని నేరుగా సవాలు చేశాయి. బీసీలు పోటీ  చేయగలరు, గెలవగలరు, పాలించగలరు అన్న సత్యాన్ని ఈ ఫలితాలు వెల్లడించాయి. అందుకే ఈ విజయం పాలక వర్గాలకు ఒక చెంపదెబ్బలా తగిలింది. ఇది వారి రాజకీయ  సౌకర్యానికి వచ్చిన  ప్రమాద సంకేతం.

- పాపని నాగరాజు(సత్యశోధక మహాసభ)