భాగ్యనగరం నుంచి నాలుగో నగరం వరకు- తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశగా రూపొందుతున్నది రాజధాని హైదరాబాద్. తెలంగాణా నేల చరిత్ర, సంస్కృతి, సాహసం, సాంకేతికతల కలయికగా హైదరాబాద్ నిలుస్తోంది. కాకతీయుల కాలం నుంచి నిజాంల యుగం వరకు ఈ ప్రాంతం ఆభరణంలా మెరిసింది. వరంగల్‌లోని రామప్ప దేవాలయం, హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ కోట వంటి అద్భుత స్మారకాలు మన సాంస్కృతిక వైభవానికి నిలువెత్తు నిదర్శనాలు. భాగ్యనగరంగా పిలిచే హైదరాబాద్ నగరం శతాబ్దాల చరిత్రను సాక్షిగా చూసింది.
కుతుబ్ షాహీలు నిర్మించిన సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. ఈ చారిత్రక వారసత్వమే నేడు తెలంగాణను ప్రపంచ వేదికపై కొత్త రూపంలో నిలబెడుతోంది. ఒకప్పుడు కళ, వాణిజ్యం, విద్యకు కేంద్రంగా ఉన్న ఈ నేల ఇప్పుడు టెక్నాలజీ, పరిశ్రమ, ఇన్నోవేషన్లకు కేంద్ర బిందువుగా అవతరిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు రాష్ట్ర అభివృద్ధి యాత్రలో మూడు ప్రధాన ఘట్టాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తున్న ‘నాలుగో నగరం’ తెలంగాణ భవిష్యత్తుకు కొత్త దిశ చూపిస్తోంది. ఇది కేవలం కొత్త పట్టణ విస్తరణ కాదు. సుస్థిర మౌలిక సదుపాయాలు, పచ్చదనం, సాంకేతిక అభివృద్ధి, గ్లోబల్ పెట్టుబడుల సమ్మేళనం. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రపంచ నగరాల సరసన నిలబడి గ్లోబల్ బిజినెస్ మ్యాప్‌లో ప్రాముఖ్యతను సంపాదించబోతోంది.
ఆధునికతకు ప్రతీక సైబరాబాద్
హైదరాబాద్చరిత్రకు ప్రతీక అయితే సైబరాబాద్ ఆధునికతకు ప్రతీక. ఇప్పుడు ఈ నాలుగో నగరం ఈ రెండింటి సమ్మేళనం. - సంస్కృతి, సాంకేతికత కలిసిన సమగ్ర అభివృద్ధి నగరం. ఇక్కడ బయో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, రీసెర్చ్, ఇన్నోవేషన్ రంగాలు ప్రధాన బలంగా నిలుస్తాయి. ప్రపంచస్థాయి సదుపాయాలతో ఈ నగరం యువతకు అవకాశాల పునాది అవుతోంది. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ 2.0 రూపకల్పన వైపు అడుగులు వేస్తోంది. పరిశ్రమలు, సేవలు, టెక్నాలజీ రంగాలలో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
‘ఇన్వెస్ట్ తెలంగాణ’ వంటి కార్యక్రమాలు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. జర్మనీ, అమెరికా, జపాన్, కొరియా, సింగపూర్ వంటి దేశాలు తెలంగాణాపై విశ్వాసం పెంచి కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నాయి. నాలుగో నగరం కేవలం సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టు కాదు. - ఇది పర్యావరణ సమతుల్యతతో కూడిన సుస్థిర అభివృద్ధి నమూనా.
గ్రీన్ ఎనర్జీ వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, ఎకో ఫ్రెండ్లీ భవన నిర్మాణం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకతను తెస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం, ప్రజల జీవనప్రమాణాలు, పారిశ్రామిక అభివృద్ధిని సమన్వయపరుస్తూ భవిష్యత్తు నగరానికి మోడల్ సృష్టిస్తోంది. అయితే, అభివృద్ధి పయనంలో పోటీ తీవ్రంగా ఉంది.
పెట్టుబడుల కోసం పోటీ
ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మరింత పోటీ దృష్టితో పనిచేయాలి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, నూతన పరిశ్రమలను ఆకర్షించడం, యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం అత్యవసరం. అభివృద్ధి కేవలం ప్రాజెక్టుల మీదే కాకుండా నాణ్యత, ఆవిష్కరణ, స్థిరత్వం మీద ఆధారపడి ఉండాలి.
ప్రపంచ నగరాలు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలంగాణ ప్రభుత్వం ముందుగానే గుర్తించి, ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతోంది. హైదరాబాద్‌చారిత్రక గౌరవం, సైబరాబాద్ సాంకేతిక ప్రతిష్ట..
ఈ రెండింటినీ సమన్వయపరుస్తూ నాలుగో నగరం రాష్ట్రానికి గర్వంగా రూపుదిద్దుకుంటోంది. భాగ్యనగరం ఒక సాంస్కృతిక మణి అయితే, ఈ నాలుగో నగరం తెలంగాణ భవిష్యత్తు ఆభరణం అవుతుంది. ఇది కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్ కాదు - ఇది మన చరిత్రకు గౌరవం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. చారిత్రక కీర్తిని నిలబెట్టుకుంటూ.. ప్రపంచ దిశగా పయనించే తెలంగాణ ఇప్పుడు ‘సాంస్కృతిక శోభతో కూడిన సాంకేతిక శక్తి’గా ఎదుగుతోంది. 2026వ సంవత్సరంలో తెలంగాణ ఫ్యూచర్ సిటీ నూతన ఒరవడితో అభివృద్ధి సాధించాలని ఆశిస్తున్నాం.
- నాగులపల్లి వెంకటేశ్వరరావు,కార్యదర్శి,తెలంగాణ మీడియా అకాడమీ
