మోదీ మళ్లీ ప్రధాని అయితే..దేశంలో ఎన్నికలే ఉండవు

మోదీ మళ్లీ ప్రధాని అయితే..దేశంలో ఎన్నికలే ఉండవు
  •     కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున్ ఖర్గే
  •     రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని కామెంట్

 మహరాజ్ గంజ్ : నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే, ఇక దేశంలో ఎన్నికలు ఉండవని కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున్  ఖర్గే అన్నారు. ఇచ్చిన హామీల్లో చాలా హామీలను మోదీ అమలు చేయలేదని, ఆయన అబద్ధాల సర్దార్ అని ఖర్గే విమర్శించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్​లోని మహరాజ్ గంజ్​లో కాంగ్రెస్ అభ్యర్థి వీరేంద్ర చౌధురికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. మోదీ మూడోసారి కూడా ప్రధాని అయితే.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని, దళితులు, బీసీలు, మహిళా అభ్యర్థులు ఉండరని ఆరోపించారు.

‘‘గత 70 ఏండ్లలో కాంగ్రెస్  పార్టీ ఏం చేసిందని మీరు (మోదీ) అడుగుతున్నారు. మేమేం చేసి ఉండకపోతే, ఈరోజు మోదీ ప్రధానిగా ఉండేవారు కాదు. మేం రూపొందించిన రాజ్యాంగం వల్లే మీరు(మోదీ) ప్రధాని అయ్యారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇది జరగదు. దళితులు, బీసీలు, రైతులు, మేధావులు.. రాజ్యాంగాన్ని మార్చనివ్వరు” అని ఖర్గే పేర్కొన్నారు. మహరాజ్ గంజ్  నుంచి పోటీచేస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్  చౌధరిపైనా ఆయన విమర్శలు చేశారు. మహరాజ్ గంజ్  ప్రజలకు పంకజ్  చేసిందేమీ లేదన్నారు.

జిల్లా హెడ్ క్వార్టర్స్ కు కనీసం రైల్వే సదుపాయం కూడా తేలేదని మండిపడ్డారు. మోదీ హయాంలో ఉత్తర ప్రదేశ్​లో ఎన్నో షుగర్  మిల్లులు మూతపడ్డాయని, అయినా కూడా ఇక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్  నోరెత్తలేదని ఫైర్  అయ్యారు. బీజేపీ నేతలు మాట్లాడే డబుల్  ఇంజిన్లలో ఒకటి ఫెయిలైందని, మరొకటి పట్టాలు తప్పిందని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్  నెహ్రూ, ఇందిరా గాంధీ చేసిన అభివృద్ధి పనులతో పోలిస్తే మోదీ చేసింది శూన్యమన్నారు.

కాంగ్రెస్ నిర్మించిన డ్యామ్ లు, బ్రిడ్జిలు, ప్రాజెక్టులపై విమర్శలు చేయడమే బీజేపీ నేతల పని అని విమర్శించారు. ఇక బుల్లెట్  ట్రెయిన్  కోసం జపాన్  వద్ద రూ.లక్ష కోట్ల రుణం తీసుకున్నారని.. కానీ, బుల్లెట్ రైలు మాత్రం రాలేదన్నారు. ఆ లక్ష కోట్లు ఎక్కడికి పోయాయని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.