చంద్రుడిపై రోవర్ చక్కర్లు.. ఇస్రో వీడియో రిలీజ్

చంద్రుడిపై రోవర్ చక్కర్లు.. ఇస్రో వీడియో  రిలీజ్

బెంగళూరు: చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ ఉన్న చోటు నుంచే గుండ్రంగా తిరిగింది. తన చుట్టూ ఎక్కడెక్కడ గుంతలు, రాళ్లు ఉన్నాయో చూసుకుని సేఫ్ రూట్ ను సెలక్ట్ చేసుకుంది. ఆ వీడియోను ఇస్రో గురువారం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘‘చందమామ మట్టిపై చిన్న పిల్లాడిలా రోవర్ గిరగిరా తిరుగుతూ ఆడుకుంటుంటే.. 

కన్నతల్లిలా ల్యాండర్ ముచ్చట పడుతూ వీడియో తీసినట్టు ఉంది కదూ!” అంటూ ఈ వీడియోకు ఇస్రో కామెంట్ పెట్టింది. ఐదు గంటల్లోనే ఈ వీడియోను 11 లక్షల మంది చూశారు. ఇక ల్యాండర్, రోవర్ మిషన్ లైఫ్ మరో 6 రోజులే ఉండటంతో ఆ లోపు ఎక్స్ పరిమెంట్లను పూర్తి చేసేందుకు రెండూ కంటిన్యూగా పని చేస్తున్నాయి.  

మరో పరికరంతోనూ సల్ఫర్ గుర్తింపు 

చంద్రుడి మట్టిలో ఇదివరకే సల్ఫర్, అల్యూమినియం, ఆక్సిజన్, ఐరన్, తదితర మూలకాలను గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్ తాజాగా మరోసారి అక్కడి మట్టిలో సల్ఫర్ మూలకాన్ని కన్ఫమ్ చేసింది. ఇంతకుముందు లిబ్స్ (లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్) పరికరంతో లేజర్ ను ప్రయోగించి మట్టిని విశ్లేషించిన రోవర్.. తాజాగా ఏపీఎక్స్ఎస్ (ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోస్కోప్)తోనూ సల్ఫర్ ను కన్ఫమ్ చేసినట్లు ఇస్రో వెల్లడించింది. 

ఏపీఎక్స్ఎస్ పరికరంతో జరిగిన ఎక్స్ పరిమెంట్ ద్వారా చంద్రుడి మట్టిలో ఉన్న సల్ఫర్ ఎలా ఏర్పడిందన్నది సైంటిస్టులు గుర్తించనున్నారు. అది అక్కడి మట్టిలో సహజంగానే ఉందా? అగ్నిపర్వతాల పేలుడు వల్ల లేదంటే ఉల్కలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిందా? అన్నది తేలనుంది. దీనివల్ల చంద్రుడి ఉపరితలం స్వభావాన్ని మరింత బాగా అర్థం చేసుకునేందుకు వీలు కానుంది.