నావికుల భద్రత మనందరి బాధ్యత.. జీ7 వేదికగా ప్రపంచ  దేశాలకు మోదీ పిలుపు

నావికుల భద్రత మనందరి బాధ్యత.. జీ7 వేదికగా ప్రపంచ  దేశాలకు మోదీ పిలుపు

ఎవియాన్ లీబా: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధిలో దాడుల వల్ల నావికులు మృత్యువాత పడుతున్నారని, భారీ సంఖ్యలో ఆస్తి నష్టం వాటిల్లుతోందని జీ7 వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య నౌకలపై ఇటీవల అమెరికా జరిపిన దాడిలో భారత నావికులు మరణించారని చెప్పారు. ఈమేరకు ఫ్రాన్స్ లో జరుగుతున్న  జీ7 సమిట్ లో మంగళవారం మోదీ మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలను స్వాగతించారు.

ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల హార్మూజ్ జలసంధి గుండా జరిగే వ్యాపారానికి ఆటంకం ఏర్పడిందని, ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పారు. భారత్‌ కు అత్యంత ఆప్తులైన స్నేహపూర్వక దేశాలలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలలో ఇప్పటికే పలువురు భారతీయ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని మోదీ పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ సముద్ర వ్యాపారం ద్వారా వివిధ దేశాలను అనుసంధానించే నావికుల భద్రతను కాపాడటం మనందరి బాధ్యత. సముద్ర రవాణా మార్గాలు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేలా మనం చర్యలు తీసుకోవాలి. నావికులు ఎలాంటి భయం లేకుండా తమ విధులను నిర్వహించుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ప్రపంచ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు.

ట్రంప్​తో మోదీ షేక్ హ్యాండ్​ 

జీ7 సమిట్​లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు. సమ్మిట్ ప్రాంగణంలో ఇద్దరు నాయకులు షేక్​హ్యాండ్ ఇచ్చుకొని చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకున్నారు.