బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ఇంట్రెస్టింగ్‌గా కొనసాగుతోంది. ఇరు జట్లు నువ్వానేనా అంటూ పోరాడుతుండటంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. చివరి రోజు భారత్ గెలుపునకు 328 రన్స్ చేయాల్సి ఉండగా, ఆసీస్‌కు 10 వికెట్లు కావాలి. ఒకవేళ డ్రా చేసుకోవాలన్నా ఐదో రోజు భారత్ బ్యాట్స్‌మెన్ ఆలౌట్ కాకుండా వికెట్లను కాపాడుకోవాలి. ఈ విషయాన్ని పక్కనబెడితే.. నాలుగో రోజు ఆటలో శార్దూల్ ఠాకూర్-వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేసిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కష్టాల్లో ఉన్న టీమిండియాను వీరిద్దరూ 123 రన్స్ భాగస్వామ్యంతో ఒడ్డున పడేయడంపై వెటరన్‌లు, కామెంటేటర్లు మెచ్చుకుంటున్నారు.
శార్దూల్-సుందర్ బ్యాటింగ్‌ను చూస్తుంటే కోహ్లీ-సచిన్ ఆడినట్లుగానే అనిపించిందని ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ‘శార్దూల్-సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వాళ్లు ఆడిన కొన్ని షాట్లు కోహ్లీ, సచిన్‌ల బ్యాటింగ్‌ను తలపించాయి. వాళ్లిద్దరూ నంబర్ 7, 8లో బ్యాటింగ్‌కు వచ్చారని మనం గ్రహించాలి. కానీ వాళ్ల బ్యాటింగ్ అమోఘం. సుందర్ బ్యాటింగ్ చేయగలడని ఐపీఎల్‌తో అర్థమైంది. అతడు మంచి ఫస్ట్‌క్లాస్ బ్యాట్స్‌మన్. అతడు అండర్-19 కెరీర్‌ను బ్యాట్స్‌మన్‌గానే ప్రారంభించాడు. శార్దూల్‌లో మంచి హిట్టింగ్ నైపుణ్యం ఉంది. అతడి టెక్నిక్ మెరుగుపడింది. సుందర్ ఆడిన కొన్ని డ్రైవ్స్ చాలా బాగున్నాయి. వాళ్లు ఇంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనకు రాలేదు. దీంతో క్లీన్ మైండ్‌సెట్‌తో బ్యాటింగ్‌కు వచ్చారు. అదే కలసివచ్చింది. సుందర్ బౌలింగ్ కూడా బాగా చేస్తున్నాడు. మూడు కీలక వికెట్లు తీశాడు. సుందర్ ఓ బ్యాటింగ్, బౌలింగ్ ప్యాకేజీలా కనిపిస్తున్నాడు’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.

