హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ వాళ్ల ధర్నా చూస్తుంటే ప్రహ్లాదుడి ముందు ప్రగల్భాలు పలికి ఖతమైపోయిన రాక్షసుడిలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. కొండా సురేఖతో మొదలైంది.. తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందోనని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌కు భయం పట్టుకుందని తెలిపారు. ఆదివారం ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మెప్పు పొందడానికి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. సమయానికి నరసింహస్వామి ఏం చేశాడో అలాగే కేసీఆర్ వచ్చి చేస్తారని చెప్పారు.
పచ్చ కాంగ్రెస్ పెత్తనం పెరుగుతున్నదని అచ్చ కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రజలు కేసీఆర్‌ను తలచుకుంటున్నారని వెల్లడించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇప్పటికీ పేదల మనసులోనే ఉన్నారని వివరించారు. అంతర్గత సంక్షోభం నుంచి బయటపడడం కోసమే కాంగ్రెస్ ధర్నా డ్రామాలాడుతున్నదని తెలిపారు. కొండా సురేఖతో మొదలైన సంక్షోభం కొనసాగుతుందని చెప్పారు.
