- బీమా, పెన్షన్ రంగాల రూపురేఖలను మార్చామన్న మంత్రి నిర్మల
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) వంటి జన్ సురక్ష స్కీమ్‌ల ద్వారా గత 11 ఏళ్లలో రూ.25,160 కోట్ల విలువైన క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయి. పాలసీహోల్డర్ మరణిస్తే రూ.2 లక్షల బీమాను పీఎంజేజేబీవై అందిస్తోంది. దీని కింద 10.7 లక్షల కుటుంబాలకు రూ.21,500 కోట్లకు పైగా క్లెయిమ్ చెల్లింపులు జరిగాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటివరకు 27 కోట్లకు పైగా ఎన్‌రోల్‌మెంట్లు జరిగాయని అన్నారు.
‘‘పీఎంఎస్‌బీవై కింద ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా పొందొచ్చు. దీని ద్వారా 1.84 లక్షల కుటుంబాలకు రూ.3,660 కోట్ల క్లెయిమ్‌లు అందాయి. ఇందులో 58 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు”అని ఆమె వివరించారు. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) స్కీమ్‌లు 2015 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఏపీవైని అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చింది. గత 11 ఏళ్లలో 9 కోట్లకు పైగా సభ్యులు ఈ స్కీమ్‌లో చేరారు. దీని కింద 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందొచ్చు. ఆన్‌లైన్ జన సురక్ష పోర్టల్ ద్వారా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్, క్లెయిమ్ ప్రక్రియను డిజిటలైజ్ చేశామని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందన్నారు.
