తమిళనాడు సీఎం, నటుడు విజయ్ కొడుకు జేసన్ సంజయ్.. ఇటీవల ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో విడుదలై నిరాశపరిచింది. ఈ క్రమంలో జాసన్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. దర్శకుడిగా మరో సినిమా తెరకెక్కిస్తాడా, లేక హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనే సస్పెన్స్ నెలకొంది. అయితే విజయ్ అభిమానులు మాత్రం తనను హీరోగా చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. జేసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేసిన లైకా సంస్థనే.. తనను హీరోగా లాంచ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లింగుస్వామి సహాలు పలువురు దర్శకులు కథలు వినిపించారని, వాటిలో సరైన కథను, దర్శకుడిని ఎంపిక చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్టు కోలీవుడ్ టాక్. మరోవైపు జేసన్ సంజయ్ బంధువైన నటుడు సంజీవ్ తన కోసం ఓ కథ రెడీ చేశాడని తానే స్వయంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లడంతో నటుడిగా ఆయన్ను మిస్ అవుతున్న అభిమానులకు.. తన నటవారసుడిగా జేసన్ సంజయ్ వస్తున్నాడనే వార్తలు జోష్ నింపుతున్నాయి.
