కరెంట్​ కట్​ చేసి..మ్యూజియలో రూ.7882 కోట్ల నగల చోరీ

కరెంట్​ కట్​ చేసి..మ్యూజియలో రూ.7882 కోట్ల నగల చోరీ

ధూమ్​2 సినిమా చూశారా? అందులో హీరో.. సారీ..సారీ సినిమాలో దొంగ అయిన హృతిక్​ రోషన్​ మ్యూజియంలో అతి పాతకాలపు వజ్రాన్ని దొంగతనం చేసే సీన్​ గుర్తుందా? ఇప్పుడు అదే రేంజ్​లో జర్మనీలోని డ్రెస్డన్​లో ఉన్న గ్రీన్​వాల్ట్​ (గ్రూనోస్‌జువోల్బి అనీ పిలుస్తారు) మ్యూజియంలో భారీ చోరీ జరిగింది. చోరీకి ముందు డ్రెస్డన్​ మొత్తం కరెంట్​ కట్ చేసిన ఘరానా దొంగలు, మ్యూజియంలోకి చొరబడి మూడు సెట్ల విలువైన 18వ శతాబ్దపు నగలను దోచుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.7,882 కోట్లు (వంద కోట్ల యూరోలు) ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చరిత్రలోనే అతిపెద్ద చోరీ అని అంటున్నారు. ఈ నగలకు కనీసం, ఇన్సూరెన్స్​కూడా చేయించలేదని తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ భారీ చోరీ జరిగింది. దొంగల కోసం పోలీసులు వెతుకుతున్నారు. కానీ, వారికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లూ దొరకలేదు. దర్యాప్తు నడుస్తున్నందున మ్యూజియంను కొన్నాళ్ల పాటు మూయనున్నారు. అది ఎన్ని రోజులన్నది అధికారులు చెప్పలేదు. జర్మనీ చాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​ మ్యూజియంను పరిశీలించారు.

వాటిని పాడుచేయకండి, ప్లీజ్​

దొంగల కోసం పోలీసులు వెతుకుతుంటే, మ్యూజియం అధికారులు మాత్రం వాళ్లకో రిక్వెస్ట్​ పెట్టారు. అవి వెలకట్టలేని సంపదని, దయచేసి వాటిని పాడుచేయొద్దని దొంగలను కోరారు మ్యూజియం అధికారులు. ఇద్దరు దొంగలు మ్యూజియం పై అంతస్తు నుంచి లోపలకి చొరబడ్డారని, గొడ్డళ్లతో అద్దాలు పగులగొట్టి నగలను దోచుకెళ్లారని డిటెక్టివ్​లు చెబుతున్నారు. మార్కెట్​లో వాటిని అందరూ గుర్తు పట్టే చాన్స్​ ఉంటుందని, కాబట్టి దొంగలు వాటిని ఏపార్టుకు ఆ పార్టు విడగొట్టి లేదంటే కరిగించి నగలను అమ్మేసే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వాటిని ఏమీ చేయొద్దని అధికారులు దొంగలకు రిక్వెస్ట్​ పెట్టారు. 2017లో బెర్లిన్​ మ్యూజియంలో జరిగిన 45 లక్షల డాలర్ల విలువైన కాయిన్​ చోరీతో ఈ చోరీకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దొంగల కోసం 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.

అగస్టస్​ నగలు

18వ శతాబ్దంలో శాక్సనీ అనే రాజ్యాన్ని అగస్టస్​ పరిపాలించేవాడు. 1694 నుంచి 1733 మధ్య ఫ్రెడరిక్​ అగస్టస్​ 3 రాజ్యాన్ని పాలించాడు. ఆయన హయాంలోనే ఈ నగలు తయారయ్యాయని మ్యూజియం అధికారులు చెబుతున్నారు. కోర్ట్​ జువెలర్స్​ అయిన జీన్​ జాక్వెస్​ పల్లార్డ్​, క్రిస్టియన్​ అగస్ట్​ గ్లోబిగ్​, అగస్ట్​ గోథెల్ఫ్​ గ్లోబిగ్​లు వాటికి రూపునిచ్చారంటారు. ఆ చరిత్రకు గుర్తుగానే డ్రెస్డన్​లో గ్రీన్​వాల్ట్​ మ్యూజియంను 1723లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పాత కాలం నాటి విలువైన సంపదను అందులోనే భద్రపరిచారు. 2010లో నాటి మ్యూజియం డైరెక్టర్, గ్రీన్​వాల్ట్​ మ్యూజియం ఫోర్ట్​నాక్స్​ అంత పటిష్ట భద్రతతో ఉంటుందని అన్నారు. కానీ, అంత పటిష్ట భద్రతలోనూ కేవలం ఇద్దరు దొంగలు అంత పెద్ద మొత్తంలోని నగలు దోచుకెళ్లడంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహుశా చరిత్రలోనే ఇదే అతిపెద్ద దొంగతనమని అధికారులు అంటున్నారు. ఇప్పటిదాకా 30 ఏళ్ల క్రితం బోస్టన్​లోని గ్రాండర్​ మ్యూజియంలో జరిగిన రూ.3,575 కోట్ల విలువైన నగల చోరీనే అతిపెద్ద చోరీగా చెబుతుంటారు. ఇప్పుడు దానిని మించి ఈ చోరీ జరిగింది.