ఆసీస్‌‌తో యాషెస్‌‌ టెస్ట్ మ్యాచ్.. రంగం సిద్ధం

ఆసీస్‌‌తో యాషెస్‌‌ టెస్ట్ మ్యాచ్.. రంగం సిద్ధం
  • నేటి నుంచే ప్రారంభం
  • గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు
  • అండర్సన్‌‌ రాకతో ఇంగ్లిష్‌‌ బౌలింగ్‌‌ బలోపేతం

ఇరు జట్ల మధ్య 141 ఏళ్ల టెస్ట్‌‌ క్రికెట్‌‌ చరిత్ర.. 70 యాషెస్‌‌ సిరీస్‌‌లు ఆడిన రికార్డు.. 33 సార్లు ఆస్ట్రేలియా, 32 సార్లు ఇంగ్లండ్‌‌ గెలిచిన ఘనత.. ! కేవలం 5 సిరీస్​లే డ్రా కావడం పోటీ తీవ్రతకు నిదర్శనం.. ! ఇంత సుధీర్ఘమైన చరిత్ర ఉన్నా.. ఈ సిరీస్‌‌కు మాత్రం ఇంకా వన్నె తగ్గలేదు…! ఏటికేడు.. కొత్త వ్యూహాలు..  సరికొత్త ఆటగాళ్లతో..  ఎక్కడ తగ్గినా.. ఇక్కడ మాత్రం తగ్గేది లేదంటూ ఇరుజట్లు చేసే పోరాటానికి.. అటు ఇంగ్లిష్‌‌, ఇటు కంగారూలు ఊగిపోతారు..! తామే మైదానంలోకి దిగి ఆడుతున్నంతగా లీనమైపోతారు..!  అలాంటి యాషెస్‌‌ సిరీస్‌‌కు మళ్లీ రంగం సిద్ధమైంది. రెండు నెలల షెడ్యూల్‌‌.. ఐదు టెస్ట్‌‌లు.. రెండు దేశాలే కాదు.. యావత్‌‌ క్రికెట్‌‌ ప్రపంచం… ఈ సిరీస్‌‌ కోసం ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూస్తున్నాయి..!

ఇప్పటికే వరల్డ్‌‌కప్‌‌ విజయంతో ఊగిపోతున్న ఇంగ్లండ్‌‌ క్రికెట్‌‌అభిమానులు.. ఇప్పుడు ఓల్డెస్ట్​ రైవలరీ కోసం సిద్ధమవుతున్నారు..! పేరుకు ‘బూడిద’ (యాషెస్‌‌) కోసం ఆటే కానీ.. కొదమ సింహాలను మించిన పోరాటాలు.. కళ్లు చెదిరే క్యాచ్‌‌లు.. గోడ కట్టినట్లు కనిపించే ఫీల్డింగ్‌‌ దృశ్యాలు.. అంతా వైట్‌‌ అండ్‌‌ వైట్‌‌లో కనిపించినా.. దాని వెనుక కోట్లాది మంది భావోద్వేగాలు ముడిపడి ఉంటాయంటే అతిశయోక్తి కాదు..! మరి మీరు కూడా సిద్ధమైపోండి..!

బర్మింగ్‌‌హామ్‌‌: క్రికెట్‌‌ చరిత్రలో తొలిసారి ‘వరల్డ్‌‌కప్‌‌’ గెలిచి ఆనంద డోలికల్లో తేలియాడుతున్న ఇంగ్లండ్‌‌.. ఆ సంబురాన్ని డబుల్‌‌ చేసుకునేందుకు రెడీ అయ్యింది. ఐదు టెస్ట్‌‌ల యాషెస్‌‌ సిరీస్‌‌లో భాగంగా గురువారం నుంచి ఆస్త్రేలియాతో తొలి టెస్ట్‌‌ ఆడనుంది. ప్రతిష్టాత్మక ఐసీసీ ‘టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌’కూ ఇదే తొలి మ్యాచ్‌‌ కావడంతో అందరూ ఆసక్తిగా దీనిపై దృష్టిసారించారు. ప్రపంచకప్‌‌లో ఇరుజట్ల పెర్ఫామెన్స్‌‌ను చూసిన తర్వాత ఈ మ్యాచ్‌‌లో ఫేవరెట్‌‌ను అంచనా వేయడం కష్టమే అయినా.. ఎడ్జ్‌‌బాస్టన్‌‌ వేదిక ఇంగ్లండ్‌‌కే అనుకూలంగా కనిపిస్తున్నది. పాత మ్యాచ్‌‌ల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ గ్రౌండ్‌‌లో ఇంగ్లండ్‌‌కే ‘ఎడ్జ్‌‌’ ఉంది. 2001 యాషెస్‌‌ నుంచి ఇక్కడ ఆడిన 11 మ్యాచ్‌‌ల్లో గెలిచిన హోమ్‌‌ టీమ్‌‌.. వరల్డ్‌‌కప్‌‌ సెమీస్‌‌లోనూ ఆసీస్‌‌ను ఓడించింది. 2001 నుంచి ఈ గ్రౌండ్‌‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌‌లో కంగారూలకు ఓటమి తప్పలేదు. అలాగే ఆసీస్​..  ఇంగ్లండ్‌‌లో యాషెస్‌‌ గెలిచి దాదాపు 18 ఏళ్ల అవుతోంది. ఈ రికార్డు కూడా ప్రతికూలంగానే కనిపిస్తున్నది. 2001లో చివరిసారి స్టీవ్‌‌ వా నేతృత్వంలోని టీమ్‌‌ 4–1తో యాషెస్‌‌ను సాధించింది. దీంతో ఈ చెత్త రికార్డును తిరగరాయాలని ఆసీస్‌‌ భావిస్తుంటే… 2017–18 సిరీస్‌‌కు ప్రతికారం తీర్చుకోవాలని ఇంగ్లండ్‌‌ పట్టుదలగా ప్రయత్నిస్తోంది. సో.. ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం..!

అండర్సన్‌‌ రీ ఎంట్రీ..

వరల్డ్‌‌కప్‌‌లో ఆడిన సగం మందిని తొలి టెస్ట్‌‌కు ఎంపిక చేసిన ఇంగ్లండ్‌‌.. ఎడ్జ్‌‌బాస్టన్‌‌ పిచ్‌‌ పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. అయితే లాస్ట్‌‌ వీక్‌‌ ఐర్లాండ్‌‌తో జరిగిన ఏకైక టెస్ట్‌‌లో 85 పరుగులకే కుప్పకూలడం ప్రతికూలాంశంగా మారింది. ఆ మ్యాచ్‌‌లో టాప్‌‌ ఆర్డర్‌‌ వైఫల్యం టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ను ఆందోళనలో పడేసింది. కెప్టెన్‌‌ రూట్‌‌.. మూడో స్థానంలో బ్యాటింగ్‌‌కు రానున్నాడు. బర్న్స్‌‌, రాయ్‌‌ ఓపెనర్లుగా ఆడనున్నారు. ఈ ముగ్గురు కుదురుకుంటే ఆసీస్‌‌కు కష్టాలు తప్పవు. మిడిలార్డర్‌‌లో డెన్లీ, బట్లర్‌‌, బెయిర్‌‌స్టో నిలకడ చూపాల్సి ఉంటుంది. వీళ్లందరి కంటే వరల్డ్‌‌కప్‌‌ హీరో బెన్‌‌ స్టోక్స్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాలి పిక్క గాయం నుంచి కోలుకున్న అండర్సన్‌‌ తుది జట్టులోకి రావడంతో బౌలింగ్‌‌ బలోపేతమైంది. బ్రాడ్‌‌, వోక్స్‌‌ చెలరేగితే ఇంగ్లండ్‌‌కు ఇబ్బంది ఉండదు. ఏకైక స్పిన్నర్‌‌గా అలీ సేవలందించనున్నాడు.

‘త్రయం’ వచ్చేసింది..

బాల్‌‌ టాంపరింగ్‌‌తో ప్రతిష్ట కోల్పోయిన ఆసీస్‌‌కు యాషెస్‌‌ గెలవడం అత్యంత కీలకం. ఈ స్కాండల్‌‌తో సంబంధం ఉన్న వార్నర్‌‌, స్మిత్‌‌, బాన్​క్రాఫ్ట్‌‌ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురూ తొలి టెస్ట్‌‌లో ఆడే అవకాశం ఉండటంతో అందరి దృష్టి వీళ్లపై పడింది. వరల్డ్‌‌కప్‌‌లో వార్నర్‌‌, స్మిత్‌‌ను ఓ ఆటాడుకున్న ఇంగ్లిష్‌‌ అభిమానులు ఈ సిరీస్‌‌లో ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. తొడకండర గాయం నుంచి కోలుకున్న ఖవాజ జట్టులోకి వచ్చాడు. ఐదో స్థానంలో హెడ్‌‌కు అవకాశం ఇచ్చినా.. నాలుగో సీమర్‌‌ కావాలనుకుంటే మిచెల్‌‌ మార్ష్‌‌ను తీసుకోవచ్చు. బౌలింగ్‌‌లో స్టార్క్‌‌ను పక్కనబెట్టిన సెలెక్టర్లు కమిన్స్‌‌, 2013లో చివరి యాషెస్‌‌ మ్యాచ్‌‌ ఆడిన పాటిన్సన్‌‌పై నమ్మకం ఉంచారు.  మూడో పేసర్‌‌ హాజిల్‌‌వుడ్‌‌, సిడిల్‌‌ మధ్య పోటీ నెలకొంది. లైయన్‌‌ స్పిన్‌‌ బాధ్యతలను చేపట్టనున్నాడు.