21 రోజుల తర్వాత ఎన్నికల రిజల్ట్స్.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న అభ్యర్థులు

21 రోజుల తర్వాత ఎన్నికల రిజల్ట్స్.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 21 రోజుల తర్వాత జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నది. దీంతో అభ్యర్థులతో పాటు పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఫలితాలు ఎలా వస్తాయో అని కంగారుపడుతున్నరు. అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మండలాల వారీగా ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. పోలింగ్ ఏజెంట్లు, పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల టైమ్​లో రిజల్ట్స్ కోసం 41 రోజుల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. 

ఫోర్త్ ఫేజ్ ఎన్నికలు పూర్తి

దేశవ్యాప్తంగా లోక్ సభ నాల్గో దశ ఎన్నికలు సోమవారంతో ముగిశాయి. తెలంగాణకు గతంలో మొదటి దశలో ఎన్నికలు జరగగా.. ఈసారి 4వ ఫేజ్​లో పోలింగ్ నిర్వహించారు. మరో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా జూన్ 1వ తేదీన పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతుంది. 2004లో ఏప్రిల్ 26న పోలింగ్‌‌ జరగ్గా మే 13న ఫలితాలు వెలువడ్డాయి. రెండింటికి మధ్య 16 రోజుల గ్యాప్ ఉంది. 2009లో ఏప్రిల్ 16, 23న రెండు దశల్లో పోలింగ్‌‌ జరగ్గా ఫలితాలు మే 16న వెలువడ్డాయి. వాటి మధ్య 30 రోజుల గ్యాప్ ఉంది. 2014లో ఏప్రిల్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగ్గా, మే 16న ఫలితాలొచ్చా యి. 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగగా మే 23న రిజల్ట్స్ వచ్చాయి.