జూబ్లీహిల్స్ మైనర్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.ఈ కేసులో A1గా సాదుద్దీన్ మాలిక్ ను రెండో రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. అమ్నెషియా పబ్ కు వచ్చినప్పటి నుండి బాధితురాలిని డ్రాప్ చేసేవరకూ పూర్తి వివరాలను అడుగుతున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా ఐదుగురు మైనర్లకు సాదుద్దీన్ కి ఉన్న పరిచయంపై పోలీసులు లోతుగా ప్రశ్నించారు.
బాధితురాలిని ఎలా ట్రాప్ చేశారనే వివరాలను సాదుద్దీన్ మాలిక్ నుండి పోలీసులు రాబడుతున్నారు. మరోవైపు ముగ్గురు మైనర్లను కస్టడీ విచారణకు జువైనల్ జస్టిస్ బోర్డ్ అనుమతిచ్చింది. ఉదయం వేళ అడ్వకేట్ సమక్షంలో జువైనల్ హోమ్ లో విచారించాలని బోర్డ్ కండిషన్ పెట్టింది. పోలీసులు సివిల్ డ్రెస్ లో వెళ్లి మైనర్లను విచారణ చేయాలని బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ 10 గంటల తర్వాత సైదాబాద్ లోని జువైనల్ హోమ్ కి వెళ్లనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈరోజు మైనర్ల వివరాలు సేకరించి కేసు గురించి విచారణ చేయనున్నారు.
