సమ్మె నుంచి వెనక్కి తగ్గం..హామీలు నెరవేర్చాల్సిందే: పంచాయతీ సెక్రటరీలు

సమ్మె నుంచి వెనక్కి తగ్గం..హామీలు నెరవేర్చాల్సిందే: పంచాయతీ సెక్రటరీలు

 

  •     వెయ్యి మంది డ్యూటీలో చేరారన్న ప్రభుత్వం అవన్నీ దొంగలెక్కలన్న జేపీఎస్​లు
  •     విధుల్లో చేరాలని బతిలాడిన కలెక్టర్లు  చర్చలు విఫలం కావడంతో ఇండ్లకు నోటీసులు
  •     వెయ్యి మంది డ్యూటీలో చేరారన్న ప్రభుత్వం
  •     అన్నీ దొంగలెక్కలన్న జేపీఎస్​లు
  •     విధుల్లో చేరాల్సిందిగా బతిమిలాడిన కలెక్టర్లు
  •     చర్చలు విఫలం కావడంతో ఇండ్లకు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని జూనియర్​ పంచాయతీ సెక్రటరీలు(జేపీఎస్) తేల్చి చెప్పారు. తమను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని ముందునుంచి ప్రతిపాదిస్తున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం మాత్రం జేపీఎస్​లు వెంటనే డ్యూటీలో చేరాలని.. ఆ తర్వాతే ఏం చేయాలనేది నిర్ణయిస్తామని అంటున్నది. కాగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెక్రటరీల సమ్మె మరింత ఊపందుకుంది. బుధవారం నుంచి సమ్మెను ఉధృతం చేస్తామని సెక్రటరీలు చెబుతున్నారు.

డ్యూటీలో చేరిందెవరూ..!

పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సోమ, మంగళవారం డీపీవోలతో టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించారు. పంచాయతీ రాజ్ లో జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఒక్కోక్కరికి 2 ఉమ్మడి జిల్లాలను అప్పగించారు. రెండు రోజులుగా ఈ అధికారులతో డీపీవోలతో, ఎంపీవోలతో మాట్లాడుతూ సెక్రటరీలు డ్యూటీలో జాయిన్ అయ్యేలా కోరాలని చెప్తున్నారు. మరోవైపు ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు సైతం సెక్రటరీల సంఘం నేతలకు సమ్మె విరమించాలని, మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది డ్యూటీలో చేరినట్లు పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ లెక్కలపై సెక్రటరీలు ఫైర్ అవుతున్నారు. అవన్ని దొంగ లెక్కలని, సమ్మెలో ఉన్న సెక్రటరీలను డ్యూటీలో చేరారని అధికారులు లెక్కల్లో చెబుతున్నారని ఆరోపించారు.

కలెక్టర్లతో చర్చలు విఫలం

డ్యూటీలో జాయిన్ కావాలని సోమవారం సాయంత్రం నుంచి ప్రభుత్వం చెప్తున్నది. మంగళవారం వివిధ జిల్లాల కలెక్టర్లు సెక్రటరీలను చర్చలకు ఆహ్వానించారు. అయితే తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు సమ్మె విరమించమని సెక్రటరీలు కలెక్టర్లకు తేల్చి చెప్పారు. జాబ్ ల నుంచి తొలగిస్తమని కలెక్టర్లు హెచ్చరించినా సెక్రటరీలు మాట వినడం లేదని పీఆర్ ఉన్నతాధికారులకు చెప్పినట్లు తెలుస్తున్నది.

సీనియర్లకు బాధ్యతలు

రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో రెగ్యులర్ సెక్రటరీలు సుమారు 3 వేల మంది ఉన్నారు. జేపీఎస్ లు వెయ్యి మంది జాయిన్ అయితే ఒక్కోక్కరికి 3 గ్రామాల చొప్పున 12వేల గ్రామాల అదనపు బాధ్యతలు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. అయితే సీనియర్లు కూడా మొదటి నుంచి జేపీఎస్ లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సమ్మెపై సీరియస్ గా ఉండటంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తున్నది.

గన్ పార్క్ దగ్గర నిరసన

డ్యూటీలో చేరాలని ప్రభుత్వం హెచ్చరించడాన్ని నిరసిస్తూ పలువురు సెక్రటరీలు మంగళవారం గన్ పార్క్ దగ్గర ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమను భయపెట్టడానికి చూస్తే.. పోరాటాన్ని ఉధృతం చేస్తామని సెక్రటరీల ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిస్తే తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యమం ద్వారా తెలంగాణ వచ్చిందనీ.. అదే స్ఫూర్తితో తాము తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా సీఎం కక్షసాధింపులకు పోకుండా... 9,355 కుటుంబాలలో వెలుగులు నింపి.. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇండ్లకు నోటీసులు

మంగళవారం ఉదయం నుంచి సెక్రటరీలతో చర్చలు జరిపిన కలెక్టర్లు, డీపీవోలు, ఎంపీవోలు అవి విఫలం కావటంతో సెక్రటరీల ఇండ్లకు నోటీసులు అంటించారు. మంగళవారం సాయంత్రం ప్రభుత్వం గడువు ఇవ్వగా అర్ధరాత్రి వరకు డీపీవోలు, ఎంపీవోల సెక్రటరీలకు ఫోన్లు చేసి డ్యూటీ జాయిన్ కావాలని బతిలాడినట్లు తెలుస్తున్నది. మొదట సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చి.. దాన్ని రాత్రి 7గంటలకు, తరువాత రాత్రి 9 గంటల వరకు పొడిగించినా సెక్రటరీలు డ్యూటీలో చేరలేదు.

సర్కారు హామీ ఇచ్చింది

ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మా సమ్మె కొనసాగుతుంది. మమ్మల్ని ఎపుడు రెగ్యులరైజ్ చేస్తరో చెప్పమంటున్నం. మాది న్యాయమైన డిమాండ్.  టీఎస్ పీఎస్సీ పరీక్ష రాసి జాబ్ లో చేరినం. మూడేండ్లు ప్రొబేషన్ టైమ్ ఉంటే సీఎం చెప్పారని నాలుగేండ్లు చేసినం. జేపీఎస్​లు డ్యూటీలో చేరినట్లు పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్న లెక్కలు అన్ని తప్పు. సమ్మెలో ఉన్న వాళ్ల పేర్లు కూడా డ్యూటీలో చేరినట్లు తప్పుడు లెక్కలు ఉన్నతాధికారులకు అందచేస్తున్నరు.
- శశిధర్, జేపీఎస్ ఫెడరేషన్ నేత