లైంగిక వేధింపుల కేసులో దర్శకుడు రంజిత్ అరెస్ట్.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదన్న బెంగాలీ నటి!

 లైంగిక వేధింపుల కేసులో దర్శకుడు రంజిత్ అరెస్ట్.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదన్న బెంగాలీ నటి!

మలయాళ చిత్ర పరిశ్రమను లైంగిక వేధింపుల వ్యవహారం కుదిపేస్తోంది. లేటెస్ట్ గా ప్రముఖ దర్శకుడు రంజిత్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఒక మహిళా నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇడుక్కి జిల్లాలో ఆయనను అరెస్టు చేశారు. సినిమా షూటింగ్ సమయంలో తనను కారవాన్‌లోకి పిలిపించి, లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కొచ్చి సిటీ పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా విచారించి, పక్కా ఆధారాలతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన తొడుపుజ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. ఈ కేసు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ తెచ్చిన విప్లవం

మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను బయటపెట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కే హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాతే ఈ అరెస్టులు ఊపందుకున్నాయి. ఈ రిపోర్టులో రంజిత్ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు రావడం గమనార్హం. గతంలోనే బెంగాలీ నటి ఒకరు రంజిత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. 2009లో ‘పాలేరి మాణిక్యం’ చిత్ర ఆడిషన్స్ కోసం పిలిచి, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె 2024 ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. - 

రంజిత్ అరెస్టుపై స్పందించిన సదరు బెంగాలీ నటి, తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. రంజిత్ పెద్ద దర్శకుడు కావొచ్చు, కానీ మంచి మనిషి మాత్రం కాదు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. నాకు న్యాయం జరగడానికి 15 ఏళ్లు పట్టింది. నాడు టెక్నికల్ కారణాలతో నా కేసు వీగిపోయినా, ఇప్పుడు మరో ధైర్యవంతురాలైన నటి ముందుకు రావడం అభినందనీయం. ఇలాంటి వేటగాళ్లను జైలుకు పంపాల్సిందే అని ఆమె వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది..

కేసు నేపథ్యం ఏమిటి?

2009లో జరిగిన ఘటనపై 15 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేయడంతో టెక్నికల్ గ్రౌండ్స్ మీద హైకోర్టు గతంలో రంజిత్‌పై కేసును రద్దు చేసింది. కానీ, తాజా ఫిర్యాదులో బాధితురాలు పక్కా ఆధారాలతో ముందుకు రావడంతో పోలీసులు ఈసారి వెనక్కి తగ్గలేదు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించే వారు ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమేనని ఈ అరెస్టు నిరూపిస్తోంది. ఉదయం రంజిత్ ను మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. కేసు విచారించిన జడ్జీ అతడిని 14 రోజుల పాటు  రిమాండ్ విధించారు.

ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో 'మీ టూ' ఉద్యమం సెకండ్ వేవ్ లా కొనసాగుతోంది. రంజిత్ అరెస్టుతో మరికొంతమంది అగ్ర దర్శకులు, నటుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మహిళా రక్షణ కోసం మాలీవుడ్ తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు ఇతర పరిశ్రమలకు కూడా దిక్సూచిగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.