న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. అలాగే, దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌ల నియామకానికి, ఐదు రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల బదిలీలకు రాష్ట్రపతి ఓకే చెప్పారు. మరో 17 మంది న్యాయమూర్తుల ట్రాన్స్ఫర్ల ఫైళ్లను కూడా రాష్ట్రపతి క్లియర్ చేశారు. దీంతో కేంద్ర న్యాయ శాఖ శనివారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. పోయిన నెల 16 న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తుల, 28 మంది న్యాయమూర్తుల పేర్లను బదిలీకి, మరో 8 మంది న్యాయమూర్తుల పేర్లను ప్రధాన న్యాయమూర్తులుగా ప్రమోషన్లకు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఇందులో ప్రస్తుతం కర్నాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సతీశ్ చంద్ర శర్మ ప్రమోషన్‌పై తెలంగాణ సీజేగా రానున్నారు. కొత్త చీఫ్ జస్టిస్‌గా సతీశ్ చంద్రతో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సోమవారం ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రస్తుతం చత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అపాయింట్ కానున్నారు. రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా పనిచేస్తున్న జస్టిస్ రామచందర్‌రావు హర్యానా, పంజాబ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ సతీశ్ చంద్ర.. 1984 లో అదే రాష్ట్రంలో అడ్వకేట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. చిన్న వయసులోనే సీనియర్ లాయర్‌గా పదోన్నతి తెచ్చుకున్నారు.1993లో కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ గా సేవలందించారు. 2004లో కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2008 లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. ఆగస్టు నుంచి కర్నాటక హైకోర్టు యాక్టింగ్ సీజేగా పనిచేస్తున్నారు.
ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉన్నా: జస్టిస్ రామచందర్‌రావు
పని ఒత్తిడితో కుటుంబంతో గడపలేకపోయానని, ఇప్పుడు బదిలీతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలవుతుందని హైకోర్టు సీనియర్ లాయర్ జస్టిస్ రామచందర్‌రావు అన్నారు. రామచందర్‌రావు పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ అయినందున జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో హైకోర్టు న్యాయమూర్తులు ఆయనకు శనివారం ఆన్లైన్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడారు. చట్టానికి లోబడి విధులు నిర్వహించానని, తాను ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తన తండ్రి, పలువురు సీనియర్ న్యాయమూర్తుల నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
