కబాలి ప్రొడ్యూసర్ డ్రగ్స్‌‌ నెట్‌‌వర్క్‌‌లో హీరోయిన్లు

కబాలి ప్రొడ్యూసర్ డ్రగ్స్‌‌ నెట్‌‌వర్క్‌‌లో హీరోయిన్లు
  • తొమ్మిది ఫోన్లలో 700 మంది ఫోన్ నంబర్స్ గుర్తింపు
  • అందులో టాలీవుడ్ సెలబ్రిటీల కాంటాక్ట్స్ లిస్ట్ 
  • డ్రగ్స్‌‌ కస్టమర్లను గుర్తించి నోటీసులిచ్చేందుకు సిద్ధం

హైదరాబాద్‌‌, వెలుగు: కబాలి సినిమా ప్రొడ్యూసర్ కృష్ణ ప్రసాద్ చౌదరి డ్రగ్స్ కేసులో సెలబ్రిటీల గుట్టురట్టయింది. ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా క్యారెక్టర్‌‌‌‌ ఆర్టిస్టులు, ఓ డైరెక్టర్‌‌‌‌ ఈ డ్రగ్స్‌‌ నెట్‌‌వర్క్‌‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారికి నోటీసులిచ్చి విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆధారాలు సేకరించిన తర్వాత వారిని అదుపులోకి తీసుకోనున్నారు. నైజీరియన్స్‌‌తో కలిసి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్‌‌ చౌదరిని సైబరాబాద్ ఎస్‌‌ఓటీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి, అతని నుంచి 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో డ్రగ్స్‌‌ కేసులో అరెస్టయిన నిందితుడు రోషన్‌‌కు చెందిన 5 ఫోన్లనూ సీజ్ చేశారు.

 ఇద్దరి ఫోన్లలో 700 మంది వివరాలను పోలీసులు సేకరించారు. రెగ్యులర్ కస్టమర్లు యూపీఐ ద్వారా పేమెంట్స్‌‌ చేసినట్లు గుర్తించారు. సీజ్‌‌ చేసిన ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌‌కు పంపించారు. వాట్సప్‌‌ రిట్రీవ్‌‌ ద్వారా డ్రగ్స్‌‌ కస్టమర్లు, పెడ్లర్లను గుర్తించి విచారించనున్నారు. కేపీ చౌదరి గోవాతో పాటు రాజేంద్రనగర్‌‌‌‌లోని కిస్మత్‌‌పురలో కూడా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. నైజీరియన్ నుంచి సేకరించిన 100 కొకైన్ ప్యాకెట్లతో ఈ వారంలో మరో పార్టీ నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేపీ చౌదరిని కస్టడీ కోరేందుకు రాజేంద్రనగర్‌‌‌‌ కోర్టులో పోలీసులు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. 

గోవా అడ్డాగా డ్రగ్స్‌‌ దందా..

కేపీ చౌదరి ‌‌కాల్‌‌ డేటా, వాట్సప్ చాటింగ్స్‌‌ ఆధారంగా సైబరాబాద్‌‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్స్‌‌ నెట్‌‌వర్క్‌‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, డ్రగ్స్ ఏజెంట్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ట ప్రసాద్‌‌ చౌదరి.. కబాలి సినిమాకు తెలుగు ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరించాడు. మరికొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌‌‌‌గా పనిచేశాడు. అదే సమయంలో ఇండస్ట్రీలోని హీరోయిన్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, వర్కర్స్‌‌తో కాంటాక్ట్స్‌‌ ఏర్పడ్డాయి. షూటింగ్స్ నేపథ్యంలో గోవాకు వెళ్లిన సమయంలో తన పబ్‌‌లో పార్టీలు ఏర్పాటు చేసేవాడు. డ్రగ్స్‌‌కు డిమాండ్‌‌ ఉండడం గమనించి సప్లయ్‌‌ చేసేందుకు స్కెచ్ వేశాడు. నైజీరియన్స్ నుంచి కొకైన్‌‌ కొనుగోలు చేసి, తన పబ్‌‌కి వచ్చే కస్టమర్లతో పాటు హైదరాబాద్‌‌లోని డ్రగ్ పెడ్లర్లకు, ఏజెంట్లకు సప్లయ్ చేసేవాడు.

ఒక్కో డ్రగ్‌‌కు ఒక్కో కోడ్‌‌ నేమ్‌‌...

గత రెండేండ్లుగా గోవాలో ఉన్న తన పబ్‌‌లో టాలీవుడ్‌‌ సెలబ్రిటీలతో భారీ ఈవెంట్స్, స్పెషల్ ప్యాకేజీలతో పార్టీలు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడు. నైజీరియన్ గ్యాబ్రియల్‌‌తో కలిసి వారికి కొకైన్ సప్లయ్ చేశాడు. రెగ్యులర్ కస్టమర్లు, ఏజెంట్స్‌‌తో స్పెషల్ వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశాడు. ఒక్కో డ్రగ్‌‌కు ఒక్కో కోడ్‌‌ నేమ్‌‌ క్రియేట్‌‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్లు ఆర్డర్ చేసిన డ్రగ్‌‌ను కొరియర్స్ లేదా లోకల్ పెడ్లర్స్‌‌ ద్వారా పంపిణీ చేసేవాడు. కృష్ణప్రసాద్‌‌ నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు ఫోన్లలో వారి కాంటాక్ట్స్ ఉన్నాయి. 

ఒక్కో ఫోన్‌‌తో వివిధ రంగాలకు చెందిన వారితో నెట్‌‌వర్క్‌‌ ఏర్పాటు చేసుకున్నాడు. వాట్సప్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లను ఉపయోగించి డ్రగ్స్ ఆర్డర్స్ తీసుకునేవాడు. చౌదరి డ్రగ్స్ నెట్‌‌వర్క్‌‌లో కస్టమర్లను గుర్తించేందుకు పోలీసులు అతని సెల్‌‌ఫోన్లను ఎఫ్‌‌ఎస్‌‌ఎల్ ల్యాబ్‌‌కు పంపించారు. పెడ్లర్ రోషన్‌‌తో కృష్ణప్రసాద్‌‌కి కాంటాక్ట్స్‌‌ ఉన్నాయి. ఈ ఇద్దరు కలిసి టాలీవుడ్‌‌ సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు. పోలీసులు వీరి నుంచి 9 సెల్‌‌ఫోన్లు స్వాధీనం చేసుకొని, కాల్‌‌ డేటా సేకరించారు. డ్రగ్ కస్టమర్లకు సంబంధించిన లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. వాట్సప్ చాటింగ్‌‌లో కాంటాక్ట్స్‌‌ను సేకరించారు. డ్రగ్స్‌‌ నెట్‌‌వర్క్‌‌లో సెలబ్రిటీల కాంటాక్ట్స్‌‌ ఆధారంగా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.