జల దిగ్బంధంలో మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, చెన్నూరు

జల దిగ్బంధంలో మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, చెన్నూరు

మంచిర్యాల/పెద్దపల్లి, వెలుగు: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు గోదావరి తీర ప్రాంతాలు నీట మునిగాయి. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు పలు పట్టణాలు, పదుల సంఖ్యలో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, చెన్నూర్, మంథనితో పాటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని తీర గ్రామాలు నీట మునిగాయి. వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ముంపు బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దయనీయ దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. ఈ విపత్తుకు కాళేశ్వరం బ్యాక్ వాటరే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. లక్ష కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు కట్టిన ప్రభుత్వం వరద ముంపును పట్టించుకోకపోవడం ప్రజలకు శాపంగా మారింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్) కు మాత్రమే భూములు సేకరించి, వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే మ్యాగ్జిమమ్ ట్యాంక్ లెవెల్ (ఎంటీఎల్) ను విస్మరించడం, ముంపు ప్రాంతాల్లో కరకట్టలు నిర్మించకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతోంది.  

8 లక్షల క్యూసెక్కుల వరదనే  ప్రామాణికంగా తీసుకున్నరు

కాళేశ్వరం బ్యాక్ వాటర్ మూలంగానే పట్టణాలు, గ్రామాలు, పంటలు మునుగుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు వంద కిలోమీటర్ల పరిధిలో నాలుగు బ్యారేజీలు కట్డడంతో గోదావరి సహజ ప్రవాహానికి బ్రేకులు పడుతున్నాయి. బ్యారేజీల గేట్లన్నీ ఎత్తినా ప్రవాహ వేగం తగ్గడంతో ఎక్కడిక్కడ వరద ఎగతన్నుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజనీరింగ్ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ఈ విపత్తుకు కారణంగా చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 8 లక్షల క్యూసెక్కుల నీటి వరదనే ప్రామాణికంగా తీసుకొని బ్యారేజీలను, పంపుహౌస్​లను నిర్మించారు. ప్రస్తుతం 20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో గేట్లు మొత్తంగా తీసినా ప్రయోజనం లేకుండా పోతోంది. పార్వతి బ్యారేజ్ వద్ద నిర్మించిన సరస్వతి పంపుహౌస్ రివర్ నీటి మట్టానికి 129 మీటర్ల ఎత్తులో కట్టారు. ఇంజనీర్ల ఎస్టిమేషన్ ప్రకారం 8 లక్షల క్యూసెక్కుల వరదకు 121 మీటర్ల ఎత్తు సరిపోతుంది. అయినా మరో ఎనిమిది మీటర్లు ఎత్తు పెంచి కట్టారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పంపుహౌస్​లు మునిగిపోతున్నాయి. రైతుల వద్ద నుంచి  సేకరించిన భూమి కూడా సరైన అంచనా లేకుండా తీసుకున్నారు. 8 లక్షల క్యూసెక్కుల వరదను ఆధారంగా చేసుకొని రైతుల నుంచి కొంత భూమినే సేకరించారు. వస్తున్న వరద తీవ్రత 15 లక్షల నుంచి 20 లక్షల క్యూసెక్కులు ఉంటోంది. దీంతో అంచనాలను మించి పంటలు, పట్టణాలు మునిగిపోతున్నాయి. అధికారుల అవగాహన లోపం వల్ల ఊర్లకు ఊర్లే మునిగిపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

20 గ్రామాల రైతుల నుంచి..

కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన సరస్వతి, పార్వతి బ్యారేజీలను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి 20 గ్రామాలకు చెందిన రైతుల నుంచి పాక్షికంగా భూములను సేకరించారు. మూడేళ్లుగా వస్తున్న బ్యాక్ వాటర్​తో వేసిన పంటలన్నీ నీట మునుగుతున్నాయి. ఆనాటి నుంచి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రాజెక్టు ప్రభావిత భూములతో పాటు గ్రామాలను కూడా తీసుకొని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇప్పుడు పంట పొలాలతో పాటు పట్టణాలు కూడా కాళేశ్వరం బ్యాక్ వాటర్ బారినపడ్డాయి. 

కరకట్టలు మరిచారు...

మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల వ్యాప్తంగా గోదావరి పరీవాహక గ్రామాలు, పట్టణాలు మూడు రోజులుగా వరదలోనే ఉన్నాయి. రామగుండం మండలంలోని మల్కాపూర్, గోదావరిఖనిలోని గంగానగర్ పూర్తిగా నీట మునిగాయి. మంచిర్యాల నుంచి గోదావరిఖనికి రాకపోకలు బంద్ అయ్యాయి. మంథని, ముత్తారం మండలాల్లోని చాలా గ్రామాలు నీట మునిగాయి. మంథని పట్టణం మొదటిసారి మునిగిపోయింది. ఇండ్లల్లో ఉన్నవాళ్లు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వేరే ఊర్లకు వెళ్లిన వాళ్లు మంథనికి రాలేకపోతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. మరోవైపు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 20 కాలనీలు, చెన్నూర్​లోని రెండు కాలనీలు నీట మునిగాయి. జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని సుమారు 20 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. గోదావరి తీరం వెంబడి రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో వందలాది కరెంట్ స్తంభాలు, ట్రాన్స్​ఫార్మర్లు నేలకూలాయి. వరద ముంపును తగ్గించేందుకు కరకట్టలు నిర్మించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

సహజ ప్రవాహానికి బ్రేకులు

ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించింది. ఎల్లంపల్లితో కలిపి వంద కిలోమీటర్ల పరిధిలో 4 బ్యారేజీలు ఉన్నాయి. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక బ్యారేజీ ఉండటంతో ఇవి గోదావరి సహజ ప్రవాహానికి బ్రేకులు వేస్తున్నాయి. నదికి అడ్డుకట్ట లేనప్పుడు వేగంగా ప్రవహిస్తూ వరదంతా వెళ్లిపోతుంది. బ్యారేజీలు కట్టక ముందు గోదావరికి భారీ వరదలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ స్థాయిలో ముంపును ఎన్నడూ చూడలేదు. ‌‌‌‌‌‌‌‌ 

- కేవీ ప్రతాప్, గోదావరి పరిరక్షణ సమితి కన్వీనర్ 

సర్కార్ పట్టించుకుంట లేదు

మూడేండ్లుగా ఇదే పరిస్థితి. వానలు పడితే పంటలు మునిగిపోతున్నాయి. మా భూములు తీసుకునేటప్పుడే మొత్తం తీసుకోమన్నం. కానీ కొన్ని భూములే తీసుకున్నరు. వరదకు మొత్తం పంటంతా కొట్టుకపోతంది. పరిహారం కోసం ఎన్నోసార్లు ఆఫీసర్ల చుట్టూ తిరిగినం. అయినా పట్టించుకుంటలేరు. 

-‌‌‌‌‌‌‌‌ జక్కుల కిషన్,  ఖాన్సాయిపేట, పెద్దపల్లి జిల్లా