ఫస్ట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్

ఫస్ట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్

వాషింగ్టన్కమలా హ్యారిస్.. అమెరికాకు కాబోయే వైస్​ ప్రెసిడెంట్. భారత సంతతికి చెందిన ఆమె అమెరికాకు మొట్టమొదటి మహిళా వైస్​ప్రెసిడెంట్​ కానున్నారు. అంతేకాదు అమెరికాలో నల్లజాతికి చెందిన మహిళ ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి. రైట్స్​ యాక్టివిస్ట్​గా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన కమల.. మొదట కాలిఫోర్నియా అటార్నీ జనరల్​గా పనిచేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. అసలు నేరుగా డెమొక్రటిక్​పార్టీ ప్రెసిడెన్షియల్​ క్యాండిడేట్​గా పోటీ పడిన ఆమె.. జో బైడెన్​కు పార్టీలో మద్దతు రావడంతో రేసు తప్పుకున్నారు. అయితే ఆమెకు ప్రజల్లో, పార్టీలో ఉన్న ఫాలోయింగ్ తో బైడెన్​ ఆమెను వైస్​ ప్రెసిడెంట్​ క్యాండిడేట్​గా ఎంపిక చేశారు.

తల్లి ఇండియన్.. తండ్రి జమైకన్

కమల తల్లి శ్యామలా గోపాలన్​ ఇండియన్. తమిళనాడులోని చెన్నైలో పుట్టిన ఆమె.. హయ్యర్​ ఎడ్యుకేషన్​ కోసం 1958లోనే అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కేన్సర్​ పరిశోధకురాలిగా పనిచేస్తూనే పౌర హక్కుల కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇక కమల తండ్రి డొనాల్డ్​ హారిస్​ జమైకా దేశానికి చెందినవారు. స్టాన్​ఫర్డ్​ యూనివర్సిటీలో ఎకానమిక్స్​ ప్రొఫెసర్. కమలకు మాయ అనే చెల్లెలు ఉంది. అయితే కమలకు ఐదేండ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. కమలా హారిస్ 2014లో డగ్లస్ ఎమోఫ్‌ అనే యూదు లాయర్​ను పెండ్లి చేసుకున్నారు. భారతీయ, యూదు సంప్రదాయలను అనుసరిస్తూ తమ వివాహం జరిగిందని ఆమె చెప్పారు.

హక్కుల పోరాటంతో మొదలుపెట్టి..

కమలా హారిస్​ తల్లి శ్యామల రైట్స్​ యాక్టివిస్ట్. 1960 టైంలోనే అమెరికాలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇది కమలపై చిన్నప్పటి నుంచే ప్రభావం చూపింది. ఈమె కూడా మహిళలు, నల్లజాతి వారి హక్కుల ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి ఇండియన్​ అమెరికన్​గా గుర్తింపు పొందారు. 2015లో ఆమె సెనేట్‌కు పోటీ చేసి.. కాలిఫోర్నియా సెనేటర్​గా గెలిచారు. అమెరికాలో పుట్టిన కమలా హారిస్​ తాను అమెరికన్​నే అని తరచూ చెప్తుంటారు. అయినా అక్కడివారు ఆమెను నల్లజాతి లీడర్​గానే చూస్తుంటారు. అమెరికాలో జాతి విద్వేషానికి వ్యతిరేకంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం జోరందుకున్న నేపథ్యంలో ఈ గుర్తింపుకు ప్రాధాన్యత కూడా పెరిగింది. కమలా హారిస్  సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటారు.

గొప్ప ఆత్మవిశ్వాసంతో..

అమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమల చాలా ఫేమస్. అమెరికాలో రేసిస్ట్​ భావజాలం ఉన్న పరిస్థితుల్లో కూడా.. ఆమె తన మూలాలను ఎప్పుడూ దాచుకోలేదు. పైగా గర్వంగా బయటికి వ్యక్తం చేస్తుంటారు. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘ది ట్రూత్స్​ వి హోల్డ్’ బుక్​లో పేర్కొన్నారు. తన పేరును ఎలా పలకాలో చెప్తూ.. తన ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శించారు. ‘‘నా పేరును కమలా అని పిలవాలి. పంక్చుయేషన్ కోసం ఉపయోగించే కామా ( , )ను పలికినట్టు పలకాలి. కమల అంటే తామర పువ్వు అని అర్థం. ఇండియన్​ కల్చర్​లో దానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ పువ్వు చెరువులో తేలియాడుతున్నట్టే కనిపిస్తుంది. కానీ దాని వేర్లు అడుగున బలంగా పాతుకుని ఉంటాయి’’ అని వివరించారు.

అమెరికాలో ఈ స్థాయికి వచ్చింది ముగ్గురే..

అమెరికాలో ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ప్రెసిడెంట్​గా, వైస్​ ప్రెసిడెంట్​గా గెలవలేదు. నల్ల జాతి మహిళలకు అయితే ప్రెసిడెన్షియల్, వైస్​ ప్రెసిడెన్షియల్​ క్యాండిడేట్లుగా కూడా చాన్స్​ రాలేదు. అసలు రాజకీయ పార్టీల నుంచి ఈ పదవుల కోసం పోటీ చాన్స్​ వచ్చిన మహిళలు ముగ్గురే. వైస్​ ప్రెసిడెంట్​ పదవి కోసం.. 1984లో డెమొక్రటిక్ క్యాండిడేట్​గా గెరాల్డైన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్​గా సారా పాలిన్ పోటీ చేశారు. కానీ గెలవలేదు. ఇప్పుడు తొలిసారిగా కమలా హారిస్​ గెలిచారు.

ఆమె పోరాట యోధురాలు

‘ఎలాంటి భయం లేకుండా పోరాటే యోధురాలు కమలా హారిస్. దేశంలోని ఉత్తమ ప్రజా సేవకుల్లో ఆమె ఒకరు’ అని వైస్​ ప్రెసిడెంట్​ క్యాండిడేట్​గా ఎన్నుకున్నప్పుడు జో బైడెన్​ ప్రకటించారు. మహిళలు, పిల్లలు, కార్మికుల హక్కుల కోసం పోరాడారని, ఆమెతో కలిసి పోటీ చేయడం గర్వంగా ఉందనీ పేర్కొన్నారు. మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించగలిగే సత్తా ఉన్న వ్యక్తి అని మెచ్చుకున్నారు.