వెనుకబడిన వర్గాల భవిష్యత్తుకు దిక్సూచి కులగణన సర్వే రిపోర్ట్: కంచ ఐలయ్య

వెనుకబడిన వర్గాల భవిష్యత్తుకు దిక్సూచి  కులగణన సర్వే రిపోర్ట్: కంచ ఐలయ్య

కుల గణన సర్వే రిపోర్ట్  తెలంగాణ సామాజిక ముఖచిత్రాన్ని మారుస్తుందన్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. ఇది కేవలం అంకెల సేకరణ కాదు, వెనుకబడిన వర్గాల ఉజ్వల భవిష్యత్తుకు ఒక దిక్సూచి అని అన్నారు. కులగణన రిపోర్ట్‌పై సోమాజీగూడ ప్రస్ క్లబ్ లో  రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా మాట్లాడిన కంచ ఐలయ్య. .‘ఈ సర్వేపై విద్యార్థులు, మేధావులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. కేవలం జనాభా లెక్కలను మాత్రమే కాకుండా, ఏ కులం ఆర్థికంగా, సామాజికంగా ఎంత వెనుకబడి ఉందో గమనించాలి. తొమ్మిది మంది సభ్యుల కమిటీలో బీసీ ప్రతినిధిగా, వైస్ చైర్మన్‌గా ఉన్న నాపై ఎందరో విమర్శలు, బూతు వ్యాఖ్యలతో దాడి చేశారు. రాజకీయ కారణాలతో కొంతమంది ఈ సర్వేను అడ్డుకోవాలని చూశారు. తమ అనుచరులను సర్వేలో పాల్గొనవద్దని, నో కాస్ట్ (No Caste) అని నమోదు చేయించుకోవాలని తప్పుదోవ పట్టించారు. కానీ, ఈ అడ్డంకులను అధిగమించి, 67 కీలకమైన ప్రశ్నలతో సమగ్రమైన నివేదికను రూపొందించాం. ఇందులో 18 అగ్రకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు అదర్స్, నో కాస్ట్ కాలమ్స్ కూడా ఉన్నాయి.ముఖ్యంగా విద్యపై ప్రత్యేక దృష్టి సారించాం. మా సర్వేలో ఇంగ్లీష్ మీడియం చదువు బ్రాహ్మణులు, కోమట్లకే ఎక్కువగా దక్కుతోందని తేలింది.ఈ అంతరాన్ని తగ్గించి, గ్రామ స్థాయిలో ఇంగ్లీష్ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ రిపోర్ట్‌పై కేవలం నగరాల్లోనే కాదు, మండల స్థాయిలో విస్తృత చర్చలు జరగాలి. 2027లో కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనకు మన సర్వే ఒక మార్గదర్శకంగా నిలవాలి. తెలంగాణలో మొదలైన ఈ చైతన్యం దేశవ్యాప్తంగా సాగాలని, ప్రతి రాష్ట్రంలో ఇలాంటి సర్వే జరగాలని మనం డిమాండ్ చేద్దాం’ అని అన్నారు .