హైదరాబాద్, వెలుగు: మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న 2 వేల మంది కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని, అప్పటి వరకు తెలంగాణ రక్షణ సేన ఉద్యమిస్తుందని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు నిర్వహించకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించడంతోనే రెండు రోజుల పాటు నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహించారని, కానీ 120 మంది కార్మికుల పేర్లే ప్రకటించారని ఆదివారం పేర్కొన్నారు. 28 మంది కార్మికులకు తమను మెడికల్ బోర్డుకు పిలిచారనే సమాచారం కూడా లేదన్నారు.
అందులో 20 శాతం మందినే అన్ ఫిట్ చేశారని పేర్కొన్నారు. సింగరేణిని కాపాడాలని, కార్మికులకు మంచి చేయాలని, వారికి భరోసా వ్వాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమీషన్లకు సీఎం, డిప్యూటీ సీఎం కక్కుర్తి పడి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే అన్ ఫిట్ ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ప్రతినెలా రెండు సార్లు మెడికల్ బోర్డు పెట్టించేలా సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలన్నారు.
