హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సు రూట్లను తగ్గించాలన్న కేబినెట్ నిర్ణయంపై రాష్ట్ర సర్కారు కేంద్రానికి లేఖ రాయనున్నట్టు తెలిసింది. కార్మికులు సమ్మె విరమించి డ్యూటీలో చేరుతామని అడుగుతున్నారని, సంస్థ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ఇప్పుడున్నట్టుగా నడపలేమని, కొన్నిరూట్ల నుంచి ఆర్టీసీ బస్సులను రద్దు చేస్తున్నామని కేంద్రానికి చెప్పనున్నట్టు సమాచారం. రూట్లను ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చిందనే దానిపై వివిధ అంశాలను, వివరణలను కూడా లేఖలో పేర్కొననున్నట్టు తెలిసింది. కేంద్రానికి ఆర్టీసీలో 31 శాతం వాటా ఉన్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగానే ఈ లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వాస్తవానికి రూట్ల జాతీయకరణ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని 3,600 రూట్లలో ఆర్టీసీకి మాత్రమే స్టేజీ క్యారియర్ గా బస్సులను నడిపించే హక్కు ఉంది. ప్రైవేటు సంస్థలు బస్సులు నడిపించే అవకాశం లేదు. ప్రస్తుతం రూట్లను ప్రైవేటుకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఆర్టీసీ పరిధిలో ఉన్న రూట్లను తగ్గించి (డీనోటిఫై చేసి), తర్వాత రూట్లను ప్రైవేటుకు అప్పగించనున్నారు. ఇందులో ఆర్టీసీ రూట్లను తగ్గించడంపై కేంద్రానికి సమాచారం ఇవ్వాలని, ఇక ప్రైవేటుకు అప్పగించే విషయంలో కేంద్రం ఇటీవల తెచ్చిన మోటార్ వెహికిల్ యాక్ట్‌ను అనుసరిస్తున్నామని చెప్పాలని నిర్ణయించారు.
ముందు జాగ్రత్తగానే..
ఆర్టీసీ ఏర్పాటు సమయంలో కేంద్రానికి 31 శాతం వాటా ఉంది. నాటి నుంచి అలాగే కొనసాగుతోంది. అయితే ఆర్టీసీకి కేంద్రం నేరుగా ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు. ఈ నెల 2న జరిగిన కేబినెట్ సమావేశం తరువాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘ఆర్టీసీలో కేంద్రం వాటా ఉంది. కానీ ఎప్పుడూ నిధులు ఇవ్వలేదు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి లేఖ రాసినం’ అని చెప్పారు కూడా. ఇదే విషయాన్ని సర్కారు హైకోర్టుకు చెప్పింది. దాంతో హైకోర్టు కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేసింది. కేసు విచారణ సమయంలో కేంద్రం తరఫున హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్ అసలు ఆర్టీసీ విభజనే కాలేదని, రాష్ట్ర సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కేంద్రానికి చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే రూట్ల అంశంపై కేంద్రానికి లేఖ రాయాలని సర్కారు నిర్ణయించిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ‘‘రూట్లను ప్రైవేటుకు అప్పగించడం వల్ల ఆర్టీసీ కొన్ని రూట్లలో బస్సులను నడిపించలేదు. దీనిపై కేంద్రానికి సమాచారం మాత్రమే ఇవ్వాల్సి ఉంది. సమాచారం ఇచ్చి పని మొదలుపెడితే భవిష్యత్ లో కేంద్రం అడిగే అవకాశం ఉండదు” అని పేర్కొంటున్నాయి.
రూట్ల ప్రైవేటు విధివిధానాలు రెడీ!
రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు 5,100 ప్రైవేటు బస్సులకు ఏయే రూట్లను అప్పగించాలన్న దానిపై రవాణా శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది. మొత్తంగా 3,600 రూట్లు ఉండగా.. అందులో సగం రూట్లను గుర్తించినట్టు సమాచారం. రూట్లను దక్కించుకున్న సంస్థ ఏ విధంగా బస్సులు నడపాలె, ఏ రూటుకు ఎంత ఫీజు చెల్లించాలె, ఎన్ని దశల్లో చెల్లించాలె, ఎంత టికెట్ చార్జీ వసూలు చేయాలె, బస్టాండ్లను వినియోగించుకునేందుకు ఎంత ఫీజు కట్టాలె, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయన్న అంశాలపై విధివిధానాలు సిద్ధం చేసినట్టు తెలిసింది. అయితే ఆర్టీసీ రూట్లను డినోటిఫై చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం ఆర్టీసీ బస్సులు మాత్రమే నడిపించే అవకాశమున్న రూట్లలో ప్రైవేటుకు కూడా అవకాశమిస్తూ సవరణ చేయనున్నారు. ఈ సవరణలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆర్టీసీ కూడా అభ్యంతరం తెలపొచ్చు. కానీ సర్కారు వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చని అధికారవర్గాలు చెప్పాయి. రోడ్డు ట్రాన్స్ పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు సంస్థలకు రూట్లను అప్పగించే ప్రక్రియ జరుగుతుందని తెలిపాయి. ఒక లాభమొచ్చే రూట్, ఒక నష్టమొస్తున్న రూట్చొప్పున కలిపి ప్యాకేజీలుగా సిద్ధం చేస్తున్నారని, దరఖాస్తు చేసుకునే సంస్థ రెండు రూట్లలోనూ బస్సులు నడపాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. టెండర్ ద్వారా ప్రైవేటు సంస్థలకు రూట్లను అప్పగిస్తారని, రూట్ ను సొంతం చేసుకున్న సంస్థ 90 రోజుల్లో బస్సులను నడపడం మొదలుపెట్టాల్సి ఉంటుందని తెలిపాయి. విధివిధానాలను రెడీ చేసిన అధికారులు.. త్వరలో జరిగే సమీక్షలో సీఎంకు అందజేయనున్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.

