ప్రముఖ కవి, కేసీఆర్ కు గురువు అయిన జైశెట్టి రమణయ్య కన్నుమూశారు. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జగిత్యాలలోని తన నివాసంలో మార్చి 27న ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు.
కేసీఆర్‌కు చరిత్ర పాఠాలు
సిద్దిపేటలో అధ్యాపకుడిగా పని చేస్తూ, అక్కడే చదువుకుంటున్న కేసీఆర్‌కు చరిత్ర పాఠాలు బోధించారు. తెలంగాణ చరిత్రను, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా దేవాలయాల చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయడంలో రమణయ్య అపారమైన కృషి చేశారు. డాక్టర్ జైశెట్టి రమణయ్య 1939వ సంవత్సరంలో జైశెట్టి శివానందం, గంగుబాయి దంపతులకు మొదటి పుత్రుడిగా జన్మించారు. వీరికి నలుగురు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. వీరు ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి, ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి , పురావస్తు శాస్త్రంలో పిహెచ్.డి (Ph.D) పట్టా పొందారు. జగిత్యాలలో మొట్టమొదటి ఎం.ఏ. డిగ్రీ పట్టా పొందిన వ్యక్తి (1963) డాక్టరేట్ పట్టా పొందిన మొదటి వ్యక్తి (1988)గా రికార్డు సృష్టించారు.
రమణయ్య సుదీర్ఘ కాలం పాటు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం అధ్యాపకులుగా పనిచేశారు. అక్కడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చరిత్ర పాఠాలు బోధించారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే క్షేత్రస్థాయి పరిశోధనలపై దృష్టి సారించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రాచీన దేవాలయాలు, శాసనాలు, జైన గుహలపై అపారమైన పరిశోధనలు చేసి, తెలంగాణ చారిత్రక సంపదను వెలుగులోకి తెచ్చారు. వీరు రాసిన "Temples of South India" కరీంనగర్ జిల్లా చరిత్రపై రాసిన పరిశోధనా గ్రంథాలు చరిత్ర విద్యార్థులకు, పరిశోధకులకు నేటికీ ప్రమాణికమైన వనరులుగా ఉన్నాయి. వీరు దేశ, విదేశాల్లోని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సందర్శించారు. వీరి సేవలకు గుర్తింపుగా "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం, కరీంనగర్ జిల్లా చరిత్ర పితామహుడు" అనే గౌరవం పొందారు.
వీరు తెలుగు, ఇంగ్లీష్, హిందీ,సంస్కృతం భాషల్లో అనర్గళంగా మాట్లాడే వక్త. 1950లో వరలక్ష్మి తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన సంతానాన్ని క్రమశిక్షణతో పెంచి, నలుగురు పట్టభద్రులు అయ్యేలా చూశారు. తన ఇంటినే గ్రంథాలయంగా మార్చుకున్నారు. "Dr. J. Ramanayya Education Trust" ను స్థాపించి 320 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. డాక్టర్ జైశెట్టి రమణయ్య నిరంతర పరిశోధనలతో తెలంగాణ చారిత్రక గొప్పతనాన్ని చాటిచెప్పారు. వారి రచనలు . సేవలు నేటితరానికి ప్రేరణగా నిలుస్తాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రమణయ్య మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
కేసీఆర్ సంతాపం
జైశెట్టి రమణయ్య మరణం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్యతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.వారి మరణంతో శొకతప్త హృదయయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
