ఆప్​ కా ఢిల్లీ : కేజ్రీవాల్‌‌ హ్యాట్రిక్‌‌ సర్కార్‌‌

ఆప్​ కా ఢిల్లీ :  కేజ్రీవాల్‌‌ హ్యాట్రిక్‌‌ సర్కార్‌‌

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం

    62 నియోజకవర్గాలను ఊడ్చేసుకున్న ‘చీపురు’

    బీజేపీ, కాంగ్రెస్​లను మట్టికరిపించి వరుసగా మూడోసారి గెలుపు

    కేవలం 8 సీట్లకు పరిమితమైన బీజేపీ

    ఖాతా తెరవని కాంగ్రెస్.. అప్పుడూ ఇప్పుడూ సున్నానే

    చాలా చోట్ల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు

ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. బీజేపీ, కాంగ్రెస్ లను వరుసగా మూడో సారి మట్టికరిపించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినంత పని చేసిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్… ఈసారి కూడా అలాంటి ఫలితాలే సాధించింది. 70 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగ్గా.. 62 స్థానాలు గెలుచుకుంది. కేవలం8 సీట్లు సాధించి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. పదేళ్లకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కనీసం ఖాతా కూడా తెరవలేదు. 11 జిల్లాల్లోని 21 లొకేషన్లలో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి లెక్కింపు పూర్తి చేశారు. 672 మంది క్యాండిడేట్లు పోటీ చేయగా.. అందులో 593 మంది పురుషులు, 79 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఐదు తక్కువ.. ఐదు ఎక్కువ..

గత ఎన్నికల్లో 67 సీట్లు సాధించిన ఆప్.. ఈ సారి 62 స్థానాల్లో గెలిచింది. అంటే ఐదు సీట్లు తగ్గాయి. గత ఎన్నికల్లో 3 సీట్లలోనే గెలిచిన బీజేపీ.. ఇప్పుడు మరో ఐదు స్థానాలు కలిపి 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ మాత్రం మారలేదు. అప్పుడూ సున్నానే.. ఇప్పుడూ సున్నానే. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్​క్యాండిడేట్లు డిపాజిట్లు కోల్పోయారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీశ్ సిసోడియా, మంత్రులు గోపాల్ రాయ్, సత్యేంద్ర జైన్, రాఘవ్ చద్దా, అతిషి సహా ఆప్​లోని ముఖ్య నేతలంతా గెలిచారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్​పై కేజ్రీవాల్ విజయం సాధించారు. పట్పర్‌గంజ్ సీటు నుంచి గెలిచిన తర్వాత సిసోడియా మాట్లాడుతూ.. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలు చేసిందని, కాని ప్రజలు ఆ పార్టీ ఎజెండాను తిరస్కరించారని చెప్పారు. ‘‘మా పని ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. ‘మీరు వేచి ఉండి చూడండి.. మేం భారీ విజయం నమోదు చేస్తాం’ అని చెప్పాం. చేసి చూపించాం’’ అని ఆప్ ప్రతినిధి సంజయ్ సింగ్ అన్నారు.

ఆప్ తరఫున స్టార్ క్యాంపెయినర్​గా కేజ్రీవాల్ ప్రచారం చేశారు. రెండు జాతీయ పార్టీల విమర్శలను తిప్పికొట్టి, ప్రచారంలో దూసుకెళ్లారు. ఇక బీజేపీ నుంచి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్, ప్రియాంక క్యాంపెయిన్ చేశారు.

ప్రజలదే ఈ విజయం: కేజ్రీవాల్​

న్యూఢిల్లీ: ‘‘స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించి, చౌకగా కరెంట్ ఇచ్చిన పార్టీని ప్రజలు గెలిపించడంతో కొత్త తరహా రాజకీయాలు మొదలయ్యాయి. ఇది దేశం గెలుపు. ఐ లవ్​యూ” అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఢిల్లీలోని ఆప్ హెడ్​క్వార్టర్స్​లో పార్టీ సపోర్టర్లతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ‘భారత్ మాతా కీ జై.. ఇంక్విలాబ్ జిందాబాద్.. వందే మాతరం’ అని నినాదాలు చేసిన తర్వాత మాట్లాడటం ప్రారంభించారు. ‘‘నన్ను తన కొడుకుగా భావించిన ఢిల్లీ ప్రజలది ఈ గెలుపు. ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు మనకు మరింత శక్తినివ్వాలి” అన్నారు. ‘పని రాజకీయాలు’(పాలిటిక్స్ ఆఫ్ వర్క్) ఢిల్లీలో మొదలయ్యాయని అన్నారు. ‘‘ఢిల్లీ ప్రజలను హనుమంతుడు ఆశీర్వదించాడు. హనుమాన్ జీ మాకు సరైన మార్గాన్ని చూపిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాం. తద్వారా వచ్చే ఐదేళ్ల వరకు మేం ప్రజలకు సేవ చేస్తూ ఉంటాం” అని చెప్పారు.