V6 News

ఉన్నత విద్యామండలి ఈసీలో కీలక నిర్ణయాలు

ఉన్నత విద్యామండలి  ఈసీలో కీలక నిర్ణయాలు

అందుబాటులో కొత్త కోర్సులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల అఫిలియేషన్లు ఇకనుంచి ఆన్​లైన్​లోనే ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త కోర్సులు, కోర్సుల కన్వర్షన్, కాలేజీల పేర్ల మార్పునూ అదే విధానంలోనే చేయనున్నారు. బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ (ఈసీ) సమావేశం జరిగింది. దీంట్లో కౌన్సిల్ చైర్మన్ లింబాద్రితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజ్ ఎడ్యూకేషన్​కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ వీసీ రవీందర్​తో పాటు వీసీలు, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. మూడేండ్ల తర్వాత ఈసీ మీటింగ్ జరగడంతో పెండింగ్​లోని ఫైళ్లను ర్యాటిఫై చేశారు. కాలేజీల అఫిలియేషన్లు ఇప్పుటి వరకు మాన్యువల్​గానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దీనికోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి ఓయూలో వర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ (యూఎంఎస్) అమలు చేస్తున్నారు. ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని కమిటీలో చర్చించినట్టు సమాచారం. వచ్చే విద్యాసంవత్సరం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.

రీసెర్చ్​ సెల్ ఏర్పాటు

దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ కేం ద్రం ఏటా ఎన్​ఐఆర్​ఎఫ్ ర్యాంకులను ఇస్తుంది. ఇదే విధానాన్ని తెలంగాణలోనూ కొనసాగించాలని కౌన్సిల్ ఈసీలో నిర్ణయించారు. ముందుగా వర్సిటీలు, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో అమలు చేయాలనీ, ఆ తర్వాత అన్ని కాలేజీలకు విస్తరించాలని చర్చించినట్టు తెలిసింది. మరోపక్క రీసెర్చ్​ను ప్రోత్సహించేందుకు రీసెర్చ్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ర్యాంకుల కేటాయింపు, రీసెర్చ్ సెల్​పై ప్రత్యేక కమిటీ వేసి విధివిధానాలు రూపొందించాలని కమిటీ నిర్ణయించింది.