V6 News

అన్నదాతలపై అడ్డగోలు భారం...భారీగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల రేట్లు

అన్నదాతలపై అడ్డగోలు భారం...భారీగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల రేట్లు
  • ఒక్కో బస్తాపై రూ.300 నుంచి రూ.700 హైక్
  • యూరియా, డీఏపీకి లింక్​ పెట్టిన కంపెనీలు
  • అవసరం లేకున్నా అంటగడుతున్న డీలర్లు
  • ట్రాన్స్​పోర్ట్​ చార్జీలతో యూరియాపై రూ.50 అదనం

మంచిర్యాల, వెలుగు: కాంప్లెక్స్​ ఎరువుల రేట్లను కంపెనీలు భారీగా పెంచాయి. ఒక్కో బస్తాపై రూ.300 నుంచి రూ.700 దాక హైక్​ చేశాయి. పెరిగిన రేట్లు ఈ నెల నుంచే అమల్లోకి వచ్చాయి. గత వానాకాలం నుంచి ఇప్పటివరకు కాంప్లెక్స్​ ఎరువుల రేట్లు పెరగడం ఇది మూడోసారి. ఏదో ఓ సాకుతో కంపెనీలు పోటాపోటీగా ధరలు పెంచడం రైతులకు మింగుడు పడడం లేదు. దీంతో రానున్న వానాకాలం సీజన్​లో అన్నదాతలపై అడ్డగోలు భారం పడనుంది. ఇట్లయితే ఎవుసం ఏం చేస్తామని నిట్టూరుస్తున్నారు. కాగా, ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా, డీఏపీ రేట్లలో మార్పులు చేయకపోవడం రైతులకు పెద్ద ఊరటగా చెప్పవచ్చు. 

వార్  సాకుతో ఇష్టారీతిన పెంపు.. 

ఓవైపు ఉక్రెయిన్–-రష్యా, మరోవైపు ఇరాన్–​-ఇజ్రాయిల్  యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మనదేశంలో ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులను కంపెనీలు పశ్చిమాసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా గ్యాస్​, పెట్రోల్​ సప్లైకి అంతరాయం కలగడం, ట్రాన్స్​పోర్టు చార్జీలు పెరగడమే కాకుండా రూపాయి మారకం విలువ పడిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్​లో ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై పడ్డట్టు చెబుతున్నారు. ఈ సాకుతో కంపెనీలు ఎరువుల రేట్లను ఇష్టారీతిన పెంచి రైతులపై భారం మోపాయి. 

ఏడాదిలో మూడుసార్లు..

గత వానాకాలం నుంచి ఇప్పటివరకు కాంప్లెక్స్​ ఎరువుల ధరలను కంపెనీలు మూడుసార్లు పెంచాయని ఫర్టిలైజర్స్​ డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక మోతాదులో వినియోగించే 20:20:0:13, ఇతర ఎరువుల రేట్లు బస్తాకు రూ.1,200 నుంచి రూ.1,300 వరకు ఉండగా, యాసంగి సీజ్​లో రూ.1,500కు పెంచాయి. తాజాగా మరో రూ.300 పెరగడంతో బస్తా ధర రూ.1,800కు చేరింది. 10:26:26 రేటు రూ.2,025 నుంచి రూ.2,2250కి, 19:19:19 ధర 2,075 నుంచి 2,300కు, 12:32:16  రేటు రూ.2,025 నుంచి రూ.2,250కి పెరిగింది. మంచిర్యాల జిల్లాలో వానాకాలం సీజన్​లో 36 వేల మెట్రిక్​ టన్నుల కాంప్లెక్స్​ ఎరువులు అవసరమవుతాయని అగ్రికల్చర్​ అధికారులు తెలిపారు. 

యూరియా, డీఏపీకి లింక్

కంపెనీలు యూరియా, డీఏపీ అమ్మకాలతో కాంప్లెక్స్​ ఎరువులకు లింక్​ పెట్టడం వల్ల ఇటు డీలర్లు, అటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలు బలవంతంగా కాంప్లెక్స్​ ఎరువులను సప్లై చేస్తుండడంతో డీలర్లు రైతులకు అవసరం లేకపోయినా వాటిని అంటగడుతున్నారు. కాంప్లెక్స్​ ఎరువులు కొంటేనే యూరియా, డీఏపీ ఇస్తామనడంతో కొనుగోలు చేయకతప్పడం లేదని రైతులు వాపోతున్నారు. 

మరోవైపు ఫర్టిలైజర్  డీలర్లకు ట్రాన్స్​పోర్టు చార్జీలు చెల్లించకపోవడంతో ఆ భారాన్ని కూడా రైతులపైనే మోపుతున్నారు. యూరియా బస్తా ధర రూ.265 కాగా, కంపెనీలు డీలర్లకు రూ.15 మాత్రమే మార్జిన్​ ఇస్తున్నాయి. ఒక్కో బస్తాకు హమాలీ చార్జీలు రూ.15, ట్రాన్స్​పోర్టు చార్జీలు రూ.30 నుంచి రూ.35 కలిపి అదనంగా రూ.50 దాక వసూలు చేస్తున్నారు. దీంతో రూ.265 యూరియా బస్తాకు రూ.300కు పైగా రైతులు చెల్లిస్తున్నారు. కంపెనీల తీరును నిరసిస్తూ డీలర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలైజర్​ షాపులు బంద్​ పెట్టారు.--

కంపెనీల తీరుతో ఇబ్బందులు 

కంపెనీలు వివిధ కారణాలతో కాంప్లెక్స్​ ఎరువుల ధరలను భారీగా పెంచాయి. ఏడాది కాలంలో ఏకంగా మూడుసార్లు రేట్లు హైక్​ చేశాయి. నిరుడితో పోలిస్తే ఒక్కో బస్తాపై రూ.700 వరకు పెంచాయి. అంతే కాకుండా యూరియా, డీఏపీతో కాంప్లెక్స్​ ఎరువులకు లింక్​ పెట్టాయి. కంపెనీలు ఇచ్చే మార్జిన్​ హమాలీ చార్జీలకు కూడా సరిపోదు. ట్రాన్స్​పోర్టు చార్జీల భారం రైతులపై వేయక తప్పడం లేదు. ఎఫ్​వోఎల్​ పద్ధతిలోనే ఎరువులను సప్లై చేయాలి. - నగేశ్, ఫర్టిలైజర్స్​ అసోసియేషన్, మంచిర్యాల