ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆటో డ్రైవర్ల సమ్మె

ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆటో డ్రైవర్ల సమ్మె

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, లారీ, బస్సు తదితర వాహనాల డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి ఆటో డ్రైవర్లు నిరవధిక సమ్మె చేపడతారని హెచ్చరించింది.

హైదరాబాద్ బషీర్‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో బుధవారం ఆటో, క్యాబ్, లారీ, బస్సు డ్రైవర్ల సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌‌‌‌టేబుల్ సమావేశం జరిగింది. బీఆర్‌‌‌‌టీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వి. మారయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్‌‌‌‌ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్, జేఏసీ అధ్యక్షుడు బి.వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

ఆర్.ఎస్. ప్రవీణ్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ చలానాల భారం తగ్గించడంతో పాటు డ్రైవర్లకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పింఛన్  అమలు చేయాలని కోరారు. ఆటో మీటర్ చార్జీలను సవరించాలని, ఓలా, ఉబెర్‌‌‌‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వమే ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించాలని సూచించారు.

డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టే ఉద్యమానికి బీఆర్‌‌‌‌ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. జేఏసీ అధ్యక్షుడు బి. వెంకటేశం మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ నెల 15 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.