- నిరసనల్లో యువతను సముదాయించాలి: సుప్రీంకోర్టు
- వారు చెప్పేది వినాలి.. పరిస్థితి చేయిదాటకుండా చూడాలన్న సీజేఐ
- కొందరు దారితప్పి రాళ్లు విసిరినా.. జాగ్రత్తగా డీల్ చేయాలని సూచన
- ఢిల్లీ నిరసనల్లో హింసకు నిర్వాహకులదే బాధ్యతంటూ రెండు పిటిషన్లు దాఖలు
- విచారణకు స్వీకరించిన సీజేఐ బెంచ్
న్యూఢిల్లీ: నిరసనల సమయంలో భద్రతా బలగాలు సంయమనం పాటించాలని.. యువతలో కొందరు దారి తప్పి రాళ్లదాడులకు పాల్పడినప్పటికీ వారిని ఓపికతో సముదాయించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో జులై 20న ‘సంసద్ చలో’ మార్చ్‌లో హింసాకాండకు కారణమైన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను, ఇలాంటిదే మరో పిటిషన్‌తో జతచేసింది. పోలీసులు, భద్రతా సిబ్బందిపై అనుచిత భాష ఉపయోగించిన వారిని గుర్తించి, వారు కమ్యూనిటీ సర్వీస్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా పిటిషనర్ కోరారు. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. కొందరు దారి తప్పిన యువత రాళ్లదాడులకు పాల్పడినప్పటికీ, సముదాయించాలని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ‘‘వారికి సలహా, కౌన్సెలింగ్ అవసరం. ప్రభుత్వం వైపు నుంచి తీసుకునే కఠిన చర్యలు సామాజికంగా పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. మరింత హింసకు దారితీస్తుంది. దానిని నివారించాలి’’ అని సీజేఐ చెప్పారు.
‘‘శాంతియుత మార్చ్‌ను ప్రోత్సహించడం ముఖ్యం. ఏదైనా సంఘటన జరిగితే, పరిస్థితి చేయి దాటిపోకుండా చూసేందుకు పోలీసులు కూడా చాలా సంయమనం పాటించాలి. అలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా, మనం వాటిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. యువత హింసకు పాల్పడకుండా మనం జాగ్రత్తగా అడుగులు వేయాలి. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, సముదాయించడమే మంచి మార్గం. అత్యంత శక్తిమంతమైన సాధనం వినడం. వారు చెప్పేది వినండి, వారు ఎందుకు నినాదాలు చేస్తున్నారో అర్థం చేసుకోండి. కానీ, దానిని శాంతిభద్రతల బాధ్యతలు చూసే సంస్థల విజ్ఞతకే వదిలేద్దాం. ఈ రకమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మీకంటే, మాకంటే వారికే బాగా తెలుసు” అని సీజేఐ చెప్పారు.
రాళ్లదాడులు చేసినా వదిలేయాలా?: పిటిషనర్
పిటిషనర్ మనీశ్ కుమార్ సోలంకి తరపున హాజరైన అడ్వకేట్ రిజ్వాన్ అహ్మద్ వాదిస్తూ.. ‘‘పదిహేను రోజులు గడిచిపోయాయి... నిర్వాహకుల జవాబుదారీతనం ఏమైంది? వారు టీవీ చానెల్స్ చుట్టూ తిరుగుతూ యువతను రెచ్చగొట్టే ప్రకటనలు ఇస్తున్నారు. పరిస్థితి చల్లారకుండా చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో ఇటీవలి శాంతిభద్రతల సంఘటనను ప్రస్తావిస్తూ, నిరసనకారులకు వెరిసి ప్రభుత్వాలు వెనుకడుగు వేయకూడదని వాదించారు. ‘‘ఒక యువకుడు మరణించాడు.
జాతీయ రాజధాని విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తే, అది రాజస్థాన్‌లో ఒక సంప్రదాయాన్ని సృష్టించదా? అక్కడ కూడా విద్యార్థులపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది. రేపు లక్నోలో డిగ్రీ కాలేజీ విద్యార్థులు మరేదైనా డిమాండ్‌తో బస్సులపై రాళ్లు విసిరితే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వెనుకడుగు వేస్తుందా?” అని అహ్మద్ అన్నారు. రాళ్ల దాడికి పాల్పడ్డ వారిని విచారిస్తే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి వస్తుందనే కారణంగా వారిని వదిలేయకూడదని వాదించారు. ‘‘ఇది చాలా ప్రమాదకరమైన సంప్రదాయం. మూడేళ్ల క్రితం రైతులు సింఘూ సరిహద్దులో ఉన్నారు. రేపు జనరేషన్ ఆల్ఫా, బీటా, డెల్టా వస్తారు’’ అని అన్నారు. పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం అని.. 500 మంది అందులోకి ప్రవేశిస్తే, వారిలో ఎవరి వద్దయినా నాటు తుపాకీ ఉందో లేదో ఎలా గుర్తించాలి? లోపలికి వెళ్లాక వారు కాల్పులు జరిపితే పరిస్థితేంటి? వారు హైవేపైనో, రైలు పట్టాలపైనో మార్చ్ చేయలేదు. ప్రజాస్వామ్య దేవాలయం వైపు మార్చ్ చేశారు. అందులో ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేయాలి’’ అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
కోర్టు విచారణల కవరేజ్‌పై నిషేధం లేదు..
న్యాయస్థానాల్లో విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్‌లను సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేయడంపై విధించిన ఆంక్షలు వార్తా సంస్థల
రిపోర్టింగ్‌కు ఎలాంటి ఆటంకం కాదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ స్పష్టం చేసింది. గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వ్యక్తమవుతున్న అయోమయాన్ని తొలగిస్తూ, మీడియా రిపోర్టింగ్ విధానంపై ఎలాంటి నిషేధాన్ని విధించలేదని తేల్చిచెప్పింది. ‘‘గుర్తింపు పొందిన వార్తా సంస్థలు కోర్టు విచారణలు, న్యాయపరమైన పురోగతి, తీర్పుల వివరాలను ప్రజలకు తెలియజేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే, వార్తలను ప్రసారం లేదా ప్రచురణచేసే క్రమంలో కోర్టు విచారణలకు సంబంధించిన అసలు ఆడియో లేదా వీడియో క్లిప్‌లను ఉపయోగించకూడదు” అని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా విచారణల వీడియోలను
సేకరించడం, ఎడిట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ లేదా రీపోస్ట్ చేయడం, వాటి ద్వారా ఆదాయం పొందడంపై జులై 24న విధించిన నియమాలు యథాతథంగా అమలులో ఉంటాయని చెప్పింది. కోర్టుల్లో ప్రత్యక్ష ప్రసారాల రికార్డింగ్‌లను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంపై జర్నలిస్ట్ హర్షిత గ్రోవర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు సోషల్ మీడియా సంస్థలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
