‘నెట్కాని’ పేరును ‘నేతకాని’గా మార్చండి.. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్కు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి

‘నెట్కాని’ పేరును ‘నేతకాని’గా మార్చండి.. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్కు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రభుత్వ రికార్డుల్లో ‘నేతకాని’కి బదులు తప్పుగా నమోదైన ‘నెట్కాని’ పేరును సరి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ను పార్లమెంట్​లోని ఆయన చాంబర్​లో కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఎంపీ మీడియాతో మాట్లాడారు.

‘నెట్కాని’ పేరు సరి చేసే అంశంపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు చెప్పారు. అయితే పేరు మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ రాయాలని కేంద్ర మంత్రి సూచించారన్నారు. దీంతో వెంటనే రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో ఫోన్​లో మాట్లాడినట్టు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాసేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే ఆర్జేఐ, ఎస్సీ కమిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. త్వరలోనే ఈ ప్రాసెస్​  కంప్లీట్ అయ్యేలా చూస్తానని చెప్పారు.

ఎన్నికల ప్రచార సమయంలో నేతకాని వర్గానికి మాటిచ్చానని, ఆ మాటను నిలబెట్టుకుంటానని ఎంపీ వంశీకృష్ణ వెల్లడించారు.