హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం (ఏప్రిల్ 29) చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కవిత టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టడం హాస్యస్పదమన్నారు.
ఉద్యమకారుడు, కేసీఆర్ బిడ్డగానే ఆమెకు గుర్తింపు ఉందని.. అంతే తప్ప ప్రత్యేకంగా ఆమెకు ఎలాంటి ఇమేజ్ లేదన్నారు. కవిత పార్టీ మొదటి సమావేశంలోనే ఉద్యమకారుడు కేసీఆర్ను తిట్టడం నాకు భాదేసింది. కూతురికి తండ్రే అంటే ప్రేమ ఉండాలి. కానీ తన మొదటి సమావేశంలోనే తండ్రిని తిట్టి కవిత తన మర్యాద పోగొట్టుకుందని అన్నారు.
సొంత తండ్రికి విలువ ఇవ్వని మనిషి రాష్ట్రానికి అమ్మ ఎలా అవుతారని ప్రశ్నించారు. అన్న మీద కోపం తండ్రి మీద చూపించడం తప్పని చురకలంటించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని.. ఆ కేసు ఇంకా విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. డబ్బులున్న వాళ్లకు రాజకీయ పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టినంత సులువు అయ్యిందన్నారు.
ALSO READ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
కవిత కొత్త పార్టీ దేవుడెరుగు ఆమె సొంతంగా పోటీ చేసిన దగ్గర కూడా డిపాజిట్ రాదని ఎద్దేవా చేశారు. ఇక, పదవి ఇస్తామని అధిష్టానం నాకు హామీ ఇచ్చింది.. నాకు పదవి ఇస్తే కచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తానని పేర్కొన్నారు.

