భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సమ్మె నోటీసులో పేర్కొన్న సమస్యలను యాజమాన్యం పరిష్కరించకపోతే వచ్చే నెల 16వ తేదీ నుంచి సింగరేణిలో సమ్మె చేపడుతామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కె.రాజ్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో యూనియన్ ఇచ్చిన సమ్మె నోటీసుపై సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం నేతల మధ్య మంగళవారం చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా సమ్మె నోటీసులోని ప్రధాన డిమాండ్లపై ఇరు పక్షాలు చర్చించినట్లు యూనియన్ నేతలు తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డులో పరీక్షించిన కార్మికులకు రీ-మెడికల్ బోర్డు నిర్వహించే అంశాన్ని యాజమాన్యం పరిశీలించాలని కోరారు.
సమ్మె నోటీసులోని డిమాండ్లపై మరోసారి చర్చించేందుకు సమావేశాన్ని వచ్చే నెల 6వ తేదీ వరకు వాయిదా వేసినట్లు తెలిపారు. ఆ సమావేశంలో సమస్యలకు పరిష్కారం లభించకపోతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ఆగస్టు 16 నుంచి సింగరేణిలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ నేతలు మిర్యాల రంగయ్య, కె.వీరభద్రయ్య, వైవీ రావు, సమ్మయ్య, సింగరేణి యాజమాన్యం తరఫున డిప్యూటీ జనరల్ మేనేజర్ బి. రాజగోపాల్ పాల్గొన్నారు.
