వేములవాడ, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు 36 శాతం లోటు వర్షపాతం నమోదైందని రాజన్న సిరిసిల్ల కలెక్టర్గరిమా అగ్రవాల్తెలిపారు. హైదరాబాద్ నుంచి మంగళవారం మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల్లోని రైతు వేదికల ద్వారా అధికారులు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. వేములవాడ అర్బన్ మండలం మారుపాక నుంచి కలెక్టర్ గరిమ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ఎగువ మానేరు, మిడ్ మానేరు, మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటికి సరిపోతుందని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిని సాగుచేయవద్దని.. రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, నువ్వులు, మొక్కజొన్న పంటలు ఇప్పటికీ వేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, డివిజన్ ఆత్మ కమిటీ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయి కుమార్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్ కుమార్, సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
