కరీంనగర్ భగత్నగర్లో దోపిడీ కేసు కొలిక్కి!..పోలీసుల అదుపులో దోపిడీకి పాల్పడిన ముగ్గురితో సహా 8 మంది

కరీంనగర్ భగత్నగర్లో దోపిడీ కేసు కొలిక్కి!..పోలీసుల అదుపులో దోపిడీకి పాల్పడిన ముగ్గురితో సహా 8 మంది
  •     కొంత సొత్తు రికవరీ
  •     ఇంటి పెద్ద అల్లుడు, అతడి కొడుకే సూత్రధారులుగా గుర్తింపు  

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ భగత్​నగర్​లో ఇటీవల జరిగిన దోపిడీ కేసు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురితోపాటు మరో ఐదుగురిని పోలీసులు ఉత్తర్​ప్రదేశ్​లోని మీరట్​లో అదుపులోకి తీసుకున్నారని, దోపిడీకి గురైన కొంత సొత్తును రికవరీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రజావుద్దీన్ కోసం వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అర్ధరాత్రి భగత్ నగర్​కు చెందిన అజ్మత్​ అలీ ఇంట్లోకి చొరబడిన దొంగలు అలీతోపాటు అతడి భార్య, ఇద్దరు కూతుళ్లను ఆయుధాలతో బెదిరించి, తాళ్లతో బంధించి ఇంట్లో ఉన్న 54 తులాల బంగారం, రూ.25 లక్షల నగదు, 30 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. 

ఈ దోపిడీని సవాల్​గా తీసుకున్న సీపీ గౌష్ ఆలం.. నిందితులు మీరట్​లో ఉన్నట్లు తెలుసుకొని ప్రత్యేక టీమ్​లను పంపారు. గత ఐదు రోజులుగా అక్కడే మకాం వేసిన పోలీసులు ఈ దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురు వ్యక్తులతోపాటు పరారీలో ఉన్న మరో ఇద్దరు దొంగల కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ దోపిడీలో కీలకంగా వ్యవహరించిన ఇంటికి పెద్ద అల్లుడు రజావుద్దీన్ పెద్ద కొడుకును కూడా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. రజావుద్దీన్​ను పట్టుకుంటే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.