హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ వీసీ కర్నాటి ప్రతాప్‌రెడ్డి గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం కేయూలో విధుల్లో ఉండగానే అస్వస్థతకు గురికావడంతో క్యాంపస్‌లో డాక్టర్ కె.బుచ్చిరెడ్డి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. బీపీతో పాటు ఈసీజీలో అసాధారణ మార్పులు కనిపించడంతో ఆయన సూచన మేరకు రిజిస్ట్రార్ వి.రాంచంద్రం వెంటనే హనుమకొండ సుబేదారిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అక్కడ డాక్టర్లు ఆంజియోగ్రామ్ నిర్వహించగా గుండె రక్తనాళంలో బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించి మంగళవారం స్టంట్ అమర్చారు. అనంతరం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీసీ ఆరోగ్య పరిస్థితిని రిజిస్ట్రార్ వి.రాంచంద్రం పర్యవేక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతాప్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని తెలిపారు. పరామర్శ కోసం ఎవరూ ఆసుపత్రికి రావొద్దని, విశ్రాంతికి సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
