కామారెడ్డి, వెలుగు: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసిన వ్యవహారంలో ముగ్గురిని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కంప్యూటర్, నకిలీ రబ్బర్ స్టాంపులు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న డాక్టర్ చందారి సంతోష్ తనకు తెలియకుండా తన సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించాడు.
ఈ నెల 22న కామారెడ్డి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ మధుసూదన్, టౌన్ సీఐ నరహరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఆన్‌లైన్ సేవా కేంద్రం నిర్వహిస్తున్న రాజా నరేందర్, రాజలింగం ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న బోయిని ప్రసాద్‌తో కలిసి నకిలీ స్టాంపులు, డాక్టర్ల సంతకాలతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం ధ్రువీకరణ పత్రాలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురిని అరెస్టు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
