హైదరాబాద్, వెలుగు: అడవుల మనుగడ, జీవవైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర కీలకమని మంత్రి కొండా సురేఖ అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పులులను సంరక్షించడం అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడటమేనన్నారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లలో పులుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మహారాష్ట్ర నుంచి దశలవారీగా పులులను తీసుకొచ్చి కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో పునరావాసం కల్పించే ‘టైగర్ రీఇంట్రడక్షన్’ ప్రాజెక్టుకు జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపిందన్నారు.
