క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? షాపింగ్, డిన్నర్లు, వెకేషన్ల కోసం భారీగా స్వైప్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులు ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ నిఘాలో ఉన్నాయని మర్చిపోకండి. భారీ స్థాయిలో క్రెడిట్ కార్డ్ పేమెంట్లు చేసే వారిని 'SFT' స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ద్వారా ట్యాక్స్ అధికారులు ట్రాక్ చేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ బిల్లు కడితే అది మీ దాచిపెట్టిన ఆదాయం కిందకు వస్తుందా? దీనిపై ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తాజా తీర్పు గురించి ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ యూజర్ తప్పక తెలుసుకోవాల్సిందే.
ఏమిటీ వివాదం?
కృష్ణ గోపాల్ సరాఫ్ అనే ఉద్యోగి తన క్రెడిట్ కార్డ్ ద్వారా ఒక ఏడాది రూ.4లక్షల 55వేలు, మరో ఏడాది రూ.7లక్షల 28 వేలు చెల్లింపులు చేశారు. ఆదాయపు పన్ను అధికారులు వీటిని గమనించి.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సరైన ఆధారాలు లేవనే కారణంతో ఆ మొత్తాన్ని సెక్షన్ 69C కింద 'అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఎక్స్‌పెండిచర్'గా భావిస్తూ అతడి ఆదాయానికి కలిపేశారు. అంటే దానిపై భారీగా పన్ను కట్టాలని నోటీసులు ఇచ్చారు.
ట్రిబ్యునల్ ఇచ్చిన కీలక తీర్పు:
ఈ కేసు ఢిల్లీలోని ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందుకు వెళ్ళింది. ఫిబ్రవరి 2025లో వెలువడిన ఈ తీర్పులో ట్రిబ్యునల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ట్యాక్స్ అధికారులు SFT/AIR డేటా ఆధారంగా నోటీసులు ఇవ్వవచ్చు. కానీ కేవలం పేమెంట్ చేశారనే కారణంతో దాన్ని ఆదాయంగా భావించకూడదని పేర్కొంది. సదరు వ్యక్తి ఆ డబ్బు తన జీతం నుంచి, గతంలో దాచుకున్న నగదు నుంచి లేదా స్నేహితుల దగ్గర తీసుకున్న అప్పు నుంచి కట్టానని చెప్పారు. అధికారులు ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్లను, ఆధారాలను సరిగ్గా పరిశీలించకుండా నేరుగా పన్ను వేయడం తప్పు అని ట్రిబ్యునల్ తేల్చింది. ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించి, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అసెస్‌మెంట్ ఆఫీసర్‌కు కేసును తిరిగి పంపింది.
రూ.18 లక్షల అదనపు ఊరట:
ఇదే కేసులో సోదాల సమయంలో దొరికిన ఒక కాగితం ఆధారంగా అధికారులు మరో రూ.18 లక్షలను ఆదాయంగా కలిపారు. అయితే ఆ కాగితంపై మరొకరి పేరు ఉందని, దానికి ఈ వ్యక్తికి సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు లేవని ట్రిబ్యునల్ ఆ రూ.18 లక్షల అడిషన్‌ను పూర్తిగా రద్దు చేసింది.
క్రెడిట్ కార్డ్ యూజర్లు ఏం చేయాలి?
మీరు భారీగా క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తుంటే, రేపు నోటీసులు వచ్చినా ఇబ్బంది లేకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.
1. ఆధారాలు సిద్ధంగా ఉంచుకోండి: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికి వాడిన డబ్బు మీ జీతం నుంచి లేదా సేవింగ్స్ నుంచి వచ్చిందని నిరూపించడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్లను జాగ్రత్తగా ఉంచుకోండి.
2. అప్పు తీసుకుంటే: స్నేహితులు లేదా బంధువుల నుంచి అప్పు తీసుకుని బిల్లు కడితే, వారి నుంచి కన్ఫర్మేషన్ లెటర్లు ఉండేలా చూసుకోండి.
3. నిజాయితీగా ఉండండి: ట్యాక్స్ అధికారులు అనుమానించినప్పుడు భయపడకుండా, సరైన డాక్యుమెంట్లు సమర్పిస్తే ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మీకు న్యాయం జరుగుతుంది.
ALSO READ : హోమ్ లోన్ మాయాజాలం: EMIలో నెలకు రూ.5వేలు ఆదా చేస్తే..
గుర్తుంచుకోండి.. మీరు క్రెడిట్ కార్డ్ వాడటం తప్పు కాదు. కానీ ఆ వాడిన డబ్బుకు లెక్కలు మాత్రం ముఖ్యం. ఆదాయపు పన్ను శాఖ మీ ఖర్చులను చూస్తుంది కానీ.. వాటికి సరైన వివరణ ఇస్తే భయపడాల్సిన అవసరం లేదని తాజా తీర్పు స్పష్టం చేస్తోంది.

