V6 News

నాగార్జున ట్వీట్తో షాక్లో టాలీవుడ్.. ‘పెద్ది’ అయితే ఏంటి.. ‘లెనిన్’ తగ్గేదే లే..!

నాగార్జున ట్వీట్తో షాక్లో టాలీవుడ్.. ‘పెద్ది’ అయితే ఏంటి.. ‘లెనిన్’ తగ్గేదే లే..!

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన కొడుకు అఖిల్ను టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో నిలబెట్టాలన్నది కింగ్ నాగార్జున కల. ఏ తండ్రికైనా తన కొడుకును ఉన్నత స్థానంలో చూడాలనే ఉంటుందిగా. నాగార్జున ఆశ కూడా అదే. ఈ కల నెరవేరే సమయం వచ్చిందనే తరహాలో నాగార్జున తన ‘ఎక్స్’ ఖాతాలో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

‘లెనిన్’ సినిమా ఫస్ట్ కట్ను గత రాత్రి చూశానని.. ఈ మాట తాను కాన్ఫిడెన్స్తో, గర్వంతో చెప్తున్నానని.. జూన్ 26, 2026న కొత్త అఖిల్ను మీరు థియేటర్లలో చూస్తారని.. ఈ డేట్ను మార్క్ చేసుకుని పెట్టుకోండని కింగ్ నాగార్జున ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్తో నాగార్జున రెండు విషయాలను చెప్పదల్చుకున్నాడు. ఒకటి.. ‘లెనిన్’ సినిమా కంటెంట్ అఖిల్ గత సినిమాల్లా ఉండదని.. మరొకటి జూన్ 26, 2026న ‘లెనిన్’ సినిమా రిలీజ్ అవుతుందని.

ఈ రెండు విషయాల్లో.. రెండో పాయింట్ మాత్రం టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. రాంచరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘పెద్ది’ సినిమా జూన్ 25న వస్తున్నప్పటికీ.. అఖిల్ సినిమాను జూన్ 26నే విడుదల చేస్తున్నట్లు నాగార్జున కుండబద్ధలు కొట్టాడు. నాగార్జున మొండి ధైర్యంపై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ‘లెనిన్’ కథపై ఎంత కాన్ఫిడెంట్గా ఉండి ఉంటే.. నాగార్జున ఈ రిస్క్ చేస్తాడని చర్చ నడుస్తుంది. ‘పెద్ది’కి పోటీగా దింపడం అంటే.. సాహసం అనే చెప్పక తప్పదు. ‘పెద్ది’ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ప్రేక్షకులు రాంచరణ్ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తడం ఖాయం. 

అలాంటిది.. ‘లెనిన్’ సినిమా కూడా ప్రేక్షకులు చూడాలంటే.. ‘పెద్ది’ సినిమా టాక్ను మించిన టాక్ వస్తేనే నాగార్జున నమ్మకం నిలబడుతుంది. కనీసం.. ‘పెద్ది’ టాక్కు తగ్గకుండా ‘లెనిన్’ టాక్ ఉండాలి. ఇన్ని ఈక్వెషన్స్ మధ్య కూడా నాగార్జున ‘లెనిన్’ సినిమాను జూన్ 26న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ‘లెనిన్’ సినిమా కంటెంట్పై ఆయనకు ఉన్న నమ్మకమే. ప్రస్తుతానికైతే.. ‘పెద్ది’ సినిమా జూన్ 25న, ‘లెనిన్’ సినిమా జూన్ 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఎంత వరకూ మళ్లీ విడుదల తేదీలు వాయిదా పడకుండా ఉంటాయో చూడాలి. పండుగల సమయంలో ఒకటికి రెండు సినిమాలు రిలీజ్ అయినా ప్రేక్షకులు చూస్తారు గానీ డ్రై సీజన్లో విడుదలైతే మాత్రం టాక్ బాగుంటేనే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది.

అఖిల్ నటన, డ్యాన్స్పై ప్రేక్షకులు సంతృప్తిగానే ఉన్నప్పటికీ అతను ఎంచుకుంటున్న కథలు మాత్రం అంతగా కలిసిరావడం లేదని అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఒకటికి రెండు (అఖిల్, ఏజెంట్) డిజాస్టర్ సినిమాలు మూటగట్టుకోవడంతో అఖిల్ సినిమాలపై ప్రేక్షకుల్లో నెగిటివ్ ఒపీనియన్ లేనప్పటికీ పాజిటివ్ ఒపీనియన్ కూడా లేదు. ‘లెనిన్’ సినిమా విడుదలైతే అక్కినేని అభిమానులు థియేటర్లలో సందడి చేయడం ఖాయం. కానీ.. సగటు సినీ ప్రేక్షకులు మాత్రం.. టాక్ బాగుంటే అప్పుడు చూద్దాంలే అనే అభిప్రాయంలో ఉన్నారని చెప్పక తప్పదు.

అఖిల్కు ఒక బ్లాక్బస్టర్ హిట్ కోసం నాగార్జున చేయని ప్రయత్నం లేదు. వివి వినాయక్, సురేందర్ రెడ్డి, ‘బొమ్మరిల్లు’ భాస్కర్.. ఇలా పేరు మోసిన డైరెక్టర్లతో అఖిల్ కోసం రంగంలోకి దించినా ఆశించిన ఫలితం రాలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో అఖిల్ నిలదొక్కుకున్నా.. స్టార్ హీరోగా ఎదిగేందుకు ఆ ఒక్క సినిమా సరిపోలేదు. వక్కంతం వంశీ కథతో, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ‘ఏజెంట్’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది.

ఒక్కమాటలో చెప్పాలంటే ‘అఖిల్’కు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం అతనితో పాటు నాగార్జున కూడా యుద్ధమే చేస్తున్నాడు. ‘లెనిన్’ సినిమా తమ ఆకలిని తీర్చుతుందని ఈ తండ్రీకొడుకులు నమ్మకంగా ఉన్నారు. జూన్ 26న ‘లెనిన్’ సినిమా విడుదలైతే చూసి.. సినిమా బాగుంటే అఖిల్కు బ్లాక్బస్టర్ కిక్ ఇవ్వడానికి ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు.