- చైనాలో 60 వేల పాములను పెంచుతున్న ‘స్నేక్ గర్ల్’
- ఏటా రూ. 1.35 కోట్ల సంపాదన
- సోషల్ మీడియాలో వైరల్.. అభినందిస్తున్న నెటిజన్లు
బీజింగ్: కన్నతండ్రి నమ్ముకున్న ‘పాముల’ వ్యాపారాన్నే ఎంచుకుంది చైనాకు చెందిన ఓ యువతి. పాముల ఫాం పెట్టి ఏటా రూ.కోట్లు గడిస్తోంది. ఏకంగా 60 వేల విషపు పాములను పెంచుతోంది. చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన క్విన్ అనే యువతి సాహసగాథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూనివర్సిటీ డిగ్రీ పట్టా అందుకున్న రెండేళ్లకే తన సొంతూరికి తిరిగొచ్చింది. ఊర్లో తండ్రి నడుపుతున్న పాముల ఫాంను తాను ఎంచుకుని డెవలప్‌చేసింది.
ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తండ్రి వారించినా చిన్నప్పటి నుంచి పాములను చూస్తుండడంతో భయపడకుండా పట్టుదలతో పాముల ఫాంను నడిపిస్తోంది. ఇప్పుడు ఆమె ఫాంలో ఏకంగా 50 వేల ‘పంచదశల’ పాములు (ఫైవ్ స్టెప్ వైపర్స్), మరో 10 వేల నాగుపాములు ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఆ ఫాంలో అడుగుపెడితే ఎటుచూసినా బుసలు కొట్టే సర్పాలే కనిపిస్తాయి. పాములంటే భయం లేదా? అని ఎవరైనా అడిగితే... చిన్నప్పటి నుంచి పాముల మధ్యే పెరిగానని చెబుతూ.. పాము కరిస్తే ఎలాగ ఉంటుందో భయంకర నిజాలు తెలిపింది.
పాములు కరిస్తే భరించలేని నొప్పి ఉంటుందని, చేతికి కరిస్తే.. అరికాళ్ల దాకా నొప్పి గుంజుతదని, ఆ మంట తట్టుకోలేక కొందరైతే.. ఆ చేయిని నరికేయమని అడుగుతారని తెలిపింది. పాముల విషం, ఎండబెట్టిన పాముకు నాణ్యతను బట్టి గ్రాముకు 40 నుంచి 200 యువాన్ల వరకు ధర ఉంటుందని, పాము మాంసం 200 నుంచి 300 యువాన్లు ఉంటుందని, పెద్ద పాములు 1,000 యువాన్లకు పైగా ధర పలుకుతున్నాయని తెలిపింది. పాము నూనెకు చైనాలో మంచి డిమాండ్ ఉందని ఆమె పేర్కొంది.
వీటిని మందుల తయారీలో (ట్రెడిషనల్ మెడిసిన్) ఉపయోగిస్తారని, ఒక్కో పాము విషానికి డిమాండ్‌ఉందని తెలిపింది. ఖర్చులన్నీ పోను ఏటా (పది లక్షల యువాన్లు) రూ.1.35 కోట్లు లాభం వస్తుందని కిన్ తెలిపింది. ‘‘పాము విషం తీసే పిల్ల’’ పేరుతో ఆన్ లైన్‌లో వీడియోలు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ధైర్యాన్ని చూసి జనం ‘అమ్మీ.. నువ్వు మామూలు దానివి కాదు’ అని కామెంట్లు పెడుతున్నారు. ‘‘చూస్తుంటేనే గుండె జారిపోతుంది.. నువ్వు మాత్రం వాటితో ఆడుకుంటున్నావు.. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోంది”అంటూ నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.

